చ‌లికాలం: పెరుగు తినొచ్చా?

మ‌నం రోజూ భోజనంలో చివరిగా పెరుగు లేదా మజ్జిగ లేనిదే  అసలు భోజనం పూర్తి చేసిన అనుభూతి ఉండదు. సమ్మర్‌లో అయితే పొరబాటున కూడా మిస్ చేయరు. కానీ, చలికాలంలో తినొచ్చా? తినకూడదా? అన్న అనుమానం చాలా మందిలో ఉంది. తింటే ఎక్కడ జలుబు చేస్తుందో, గొంతు నొప్పి భయంతో కొంత మంది తినాలని ఉన్నా తిన‌లేక‌పోతారు. ఎక్కువ మందిలో ఉన్న నమ్మకం కూడా ఇదే! విటమిన్లు, ప్రొటీన్లు, కాల్షియం వంటి అనేక పోషకాలున్న‌ ‌ పెరుగు తినే విషయంలో ఎన్నో అనుమానాలు. దీని విష‌యంలో న్యూట్రిషనిస్ట్‌లు, ఆయుర్వేదం, సైన్స్ సమాధానాలేంటో చూద్దాం.

న్యూట్రిషనిస్ట్‌లు

పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అపారమైనవి. పాలలో కంటే పెరుగులో లాక్టోజు పరిమాణం తక్కువ. పాలలోని లాక్టోజ్‌ సరిపడని కారణంగా పాలు, పాల ఉత్పత్తులు తిన్నప్పుడు జీర్ణాశయ ఇబ్బందులు పడేవాళ్ళు కూడా పెరుగును హాయిగా తినవచ్చు. పెరుగులో కూడా ప్రొటీన్లు పుష్కలం. పాలలో కన్నా పెరుగులో ప్రొటీన్లను శరీరం త్వరగా శోషించుకుంటుంది. పెరుగులో అధిక మోతాదులో లభించే గ్లెయిసిన్‌, ప్రొలైన్‌ అనే అమైనో ఆమ్లాలు చర్మాన్ని, గోళ్లను, వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదం చేస్తాయి. క్యాన్సరును, ముఖ్యంగా బ్రెస్ట్‌క్యాన్సర్‌, పెద్దపేగుల క్యాన్సర్ల నిరోధకంగా పని చేసే కాంజుగేటెడ్‌ లినోలిక్‌ యాసిడ్‌ అనే ఫాటీయాసిడ్‌ ఇళ్లల్లో తయారు చేసుకునే పెరుగులో ఎక్కువ. మలబద్ధకాన్ని పోగొట్టడానికి, నీళ్ల విరోచనాలను నియంత్రించడానికి పెరుగు ఉపయోగపడుతుంది. చలికాలంలో పెరుగును చల్లగా తినడానికి ఇష్టపడకపోతే పగటి పూట చిక్కటి మజ్జిగగానో, కూర ముక్కలు వేసి రైతా లాగానో, రోటి పచ్చళ్లలో, కూరల్లో కలపడం ద్వారానో తీసుకోవచ్చు. ఏ కాలంలో అయినా కనీసం రోజుకు ఒక్క పూట పెరుగు తీసుకుంటే మంచిది. ఇది అన్ని వయసుల వారికీ వర్తిస్తుంది.

ఆయుర్వేదం

చలికాలంలో సాధారణంగా జలుబు, దగ్గు లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. వాతావరణంలో మార్పు, చలి కారణంగా సహజంగా ఉండే ఇబ్బందే ఇది. ముక్కులు పట్టేయడం, గొంతులో గరగరలా ఉండి గల్ల వస్తుంటుంది. అయుర్వేదం పరిభాషలో దీన్నే కఫం అంటారు. ఊపిరితిత్తుల అంతర్భాగంలో గోడలకు చెమ్మ పట్టి ఊరే ద్రవమే ఈ కఫం. చలికాలంలో ఇది ఎక్కువై జలుబు, దగ్గు లాంటి వస్తుంటాయి. ఈ సమయంలో పెరుగు తింటే కఫం ఇంకా ఎక్కువయ్యే చాన్స్ ఉందని ఆయుర్వేదం చెబుతోంది. అస్తామా, సైనస్ లాంటి సమస్యలు ఉన్న వారిలో ఇది మరింత తీవ్రమై బాగా ఇబ్బందిపెడుతుంది. సో చలికాలంలో పెరుగు తినకపోవడమే మేలని ఆయుర్వేదం చెబుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో అసలు వద్దని సూచిస్తోంది. పోషకాల కోసం రాత్రులు పాలు తాగి, మధ్యాహ్నం వేళ పెరుగు లేదా మజ్జిగ తీసుకోవడం మేలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.

ఆయుర్వేదం ప్రకారం కఫానికి విరుగుడు వెల్లుల్లి. కాబట్టి పెరుగు బాగా ఇష్టంగా తినేవాళ్లు కచ్చితంగా పోపు పెట్టుకుని తినడం మేలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అందులో కనీసం మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కొంత జీలకర్ర వేయడం వల్ల కఫాన్ని అడ్డుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఇలా చేసినా కూడా రాత్రి వేళ పెరుగును దూరం పెట్టడమే మంచిదని చెబుతున్నారు.

సైన్స్

పెరుగులో శరీరానికి మేలు చేసే గుడ్ బ్యాక్టీరియాలు, బీ12 విటమిన్, కాలిషియం వంటి పోషకాలు ఫుల్‌గా ఉంటాయని సైన్ చెబుతోంది. రోగ నిరోధక శక్తి పెంచడంలోనూ ఉపయోగపడుతుందు. చలికాలంలోనూ దీన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే జలుబు, దగ్గు, ఆస్తమా, పలు రకాల శ్వాస సంబంధమైన సమస్యలు ఉన్నవాళ్లు సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత పెరుగు తీసుకోవద్దని సూచిస్తున్నారు. చలికాలంలో వీలైనంత వరకు పగలు మాత్రమే పెరుగు తినాలంటున్నారు. అయితే కొంత మంది నిపుణులు సీ విటమిన్ ఉండే ఫుడ్ తీసుకుంటే జలుబు లాంటి త్వరగా తగ్గుతాయని, సో చలికాలంతో తినొచ్చని చెబుతున్నారు.

:

Leave A Reply

Your email address will not be published.