`జగనన్న జీవక్రాంతి` పథకం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గురువారం ‘జగనన్న జీవ క్రాంతి’ పథకాన్ని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించారు. వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల్లో అక్క చెల్లెమ్మలకు స్వయం ఉపాధి కల్పించే దిశలో చేపట్టిన మేకలు, గొర్రెల పంపిణీ ‘జగనన్న జీవక్రాంతి’ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మేలు జాతికి చెందిన 2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టగా, మొత్తం రూ.1869 కోట్ల వ్యయంతో పథకం అమలు చేస్తున్నారు.
పథకం ప్రారంభోత్సవం సందర్భంగా లబ్ధిదారులు జగన్‌కు గొంగడి కప్పి, తాటి ఆకులతో రూపొందించిన గొడుగు, మేక పిల్లను బహుకరించారు. అనంతరం జగన్ మాట్లాడారు. బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కచెల్లెమ్మలు తమ స్వగ్రామంలోనే వ్యాపారం చేసుకునేలా ప్రయత్నం చేయించడమే పథకం ఉద్దేశ్యమన్నారు. చేయూత పథకంలో ఏటా రూ.18,750 చొప్పున 4 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు ఇస్తున్నామన్నారు.