జగన్‌ కేసుల విచారణ 12కి వాయిదా

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ ఈ నెల 12 కి వాయిదా పడింది. కాగా జగన్‌, విజయసాయిరెడ్డి, ఇతర నిందితులు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా, వాటిని కోర్టు అంగీకరించింది. హైదరాబాద్‌లోని సిబిఐ, ఈడీ కోర్టుల్లో ఉన్న కేసులకు సంబంధించి ప్రతీ శుక్రవారం విచారణ జరిగేది. అయితే ఇటీవల సుప్రీం కోర్టు ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను సత్వర విచారణ చేపట్టాలని సూచించింది. దీనిపై స్పందించిన హైకోర్టు రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేసు విచారణను సిబిఐ కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. కాగా జగన్‌ కేసులో నాలుగు ఛార్జిషీట్లకు సంబంధించి హైకోర్టులో స్టే ఉంది. స్టే ఉన్న కేసులను నవంబర్‌ 9 కి వాయిదా వేస్తున్నట్లు సిబిఐ కోర్టు తెలిపింది. కరోనా నేపథ్యంలో.. కోర్టు హాలులో ఎక్కువమంది న్యాయవాదులు, నిందితులు ఉండటం ఇబ్బందిగా ఉండటంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టాలని, జగన్‌ తరపు న్యాయవాదులు కోరారు. తాము కూడా విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనిపై స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.