జనవరి 1 నుంచి స్కూళ్లు తెరిచే రాష్ట్రాలు ఇవే..

న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్కు ముందే మూత పడిన స్కూళ్లను జనవరి 1 నుంచి తెరిచేందుకు కేరళ, కర్ణాటక, అసోం రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. రేపటి (శుక్రవారం) నుంచి తరగతులను పాక్షికంగా పునరుద్ధరించనున్నారు. కేరళలో 10, 12వ తరగతి విద్యార్థులకు నిర్దేశించిన గంటల్లో పరిమిత సంఖ్యలో స్టూడెంట్స్తో క్లాసులు నిర్వహించనున్నారు. కర్ణాటకలో ఆరు నుంచి 12వ తరగతి విద్యార్థులకు జనవరి 1 నుంచి స్కూళ్లను పునరుద్ధరించనున్నారు. 6-9 తరగతుల ప్రభుత్వ స్కూళ్లను జనవరి 15 నుంచి తెరువనున్నారు. అసోంలో ఎలిమెంటరీ స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు అన్ని విద్యాసంస్థలను శుక్రవారం నుంచి తెరువనున్నారు. సెప్టెంబర్ నుంచే దశల వారీగా స్కూళ్ల పునరుద్ధరణను ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. కాగా బీహార్, పాండిచ్చెరితోపాటు పూణేలో జనవరి 4 నుంచి పాక్షికంగా పాఠశాలలను తెరువనున్నారు. మరికొన్ని రాష్ట్రాలు కూడా స్కూళ్లను జనవరిలో పునరుద్ధరించేందుకు సిద్ధమయ్యాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలు ఇప్పటికే తరగతులను పాక్షికంగా నిర్వహిస్తున్నాయి.