జలదిగ్బంధంలో అమీన్ పూర్
అమీన్ పూర్ః వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వానలకు తెలంగాణ తడిసి ముద్దైంది. మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పఠాన్ చెరువు మండలం అమీన్ పూర్ నగరపాలక సంస్థ పరిధిలోని పలు కాలనీలు నీటి మునిగాయి. కాలనీల్లో ఇళ్ళల్లో నాలుగు అడుగుల మేరకు నీరు నిలిచి పోయింది. దాదాపు వెయ్యి ఇళ్ళు జలదిగ్బంధంలో ఉన్నాయి. వీరికి ఆహారం, మంచినీరు,పాలు అందక కాలనీ వాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రయివేటు ఇన్‌స్టిట్యూషన్స్, బ్యాంకింగ్ సంస్థలు, ఫినాన్సియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు నేడు, రేపు సెలవులు ప్రకటించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జీవో జారీ చేశారు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 ప్రకారం ఈ సెలవుపు ప్రకటించినట్లు పేర్కొన్నారు. అత్యవసర సేవల సిబ్బందికి మాత్రం మినహాయింపు ఉన్నట్లు తెలిపారు.