జిహెచ్ఎంసి ప్రజలకు గుడ్‌న్యూస్!
75 చ.గల స్థలంలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతి అక్కర్లేదు !
హైదరాబాద్: జిహెచ్ఎంసి ప్రజలకు గుడ్‌న్యూస్! 75 చదరపు గజాల వరకు స్థలంలో ఇంటి నిర్మాణానికి ఇక అనుమతి అవసరం లేదు. 76 నుంచి 600 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లలో నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణ ఆధారంగా తక్షణ ఆమోదం లభించనుంది. ఈ మేరకు టీఎస్ బీపాస్ బిల్లును సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించారు. 75 చ.గల వరకు ఉన్న స్థలంలో ఏడు మీటర్ల ఎత్తు వరకు (జీ ప్లస్ ఒక అంతస్తు, స్టిల్ట్ ప్లస్ రెండంతస్తులు) భవనం కట్టుకోవచ్చు. 76 నుంచి 600 చ.గల వరకు ఉన్న ప్లాట్‌లో 10 మీటర్ల (గ్రౌండ్ ప్లస్ రెండు లేదా స్టిల్ట్ ప్లస్ మూడంతస్తులు) ఎత్తు భవనానికి తక్షణ ఆమోదం లభిస్తుంది.
నిబంధనలుః 75 చ.గల వరకు స్థలంలో నివాస భవన నిర్మాణానికి అనుమతి అవసరం లేదు. టోకెన్ ఫీజుగా ఒక రూపాయి చెల్లించి ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ వివరాలు నమోదు చేసుకోవాలి. దాంతోపాటు రూ. 100 ఆస్తిపన్ను చెల్లించాలి. ప్రభుత్వ భూమి, జల వనరులు, నిషేధిత భూము ల్లో ప్లాట్ లేదని ప్రకటించడంతోపాటు స్థల విస్తీర్ణం, నిర్మించనున్న అంతస్తుల సంఖ్యను ధ్రువీకరించాలి. ఉల్లంఘనలు జరిగినట్టు గురిస్తే భవనం కూల్చివేత/మూసివేత/జరిమానా విధింపు.