టిడిపి హాయాంలో ఒక్క సెంటు భూమి ఇవ్వలేదు..

పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్ దే ..
అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు తోట త్రిమూర్తులు..
మండపేట (CLiC2NEWS): రాష్ట్రంలో పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత తమ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైఎస్సార్సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. మండల పరిధిలోని వేములపల్లి లో నిర్వహించిన లబ్దిదారుల ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ద్వారపూడి సర్పంచ్ ఈతకోట కిన్నెర అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ద్వారపూడి పారిశ్రామిక వ్యాపార రంగాల్లో జిల్లా స్థాయిలో అగ్రగామిగా నిలిచింది అన్నారు. మేజర్ పంచాయితీ గా ఉన్న ద్వారపూడి వేములపల్లి లో 5 వేల ఇళ్లు నిర్మాణం పూర్తయితే ఈ గ్రామం భవిష్యత్ లో నగర పంచాయితీగా మరింత అభివృద్ధి సాధిస్తుంది అన్నారు. లే అవుట్ లో లబ్దిదారులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
గతంలో కాంగ్రెస్ హయాంలో డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి ఎమ్మెల్యేగా పని చేసిన సమయంలో నియోజక వర్గంలో పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ జరిగిందన్నారు. అయితే గత తెలుగు దేశం హాయాంలో ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదని విమర్శించారు. టీడీపీ ప్రచార ఆర్భాటాలకే పరిమితం అయిందన్నారు. అదే విధంగా ద్వారపూడి, మేడపాడు, కేశవరం గ్రామాలు గత 20 ఏళ్లుగా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉందని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక పేదలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతూ వచ్చింది అన్నారు. కాలనీకి సంబంధించిన సౌకర్యాల కల్పనలో భాగంగా ఇసుకను ఉచితంగా అందజేస్తామని అన్నారు. అలాగే ఇంటి నిర్మాణానికి ప్రధాన అవసరమైన ఇటుకను అతి తక్కువ ధరకే లబ్దిదారులకు అందేలా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. అదే విధంగా సిమెంట్ గోదాము కూడా నిర్మించడం జరిగింది అన్నారు. కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు నీటి వసతి కల్పించడం జరిగింది అన్నారు. త్వరలో కాలనీకి సీసీ రోడ్లు, డ్రైన్లతో పాటు కరెంట్ ఇతర మౌలిక వసతులు అన్నీ కల్పిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఐదం రాజు, రూరల్ ఎస్సై రావూరి మురళీ మోహన్, గృహ నిర్మాణ శాఖ అధికారులు చంద్ర శేఖర్, గనేశ్వరరావు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈ భాగ్యరాజ్ , ద్వారపూడి పంచాయితీ కార్యదర్శి సుబ్బారావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్న బాబు, మండల కన్వీనర్ పిల్లా వీరబాబు, మారేడుబాక సర్పంచ్ మట్టపర్తి గోవింద రాజు, మెర్నిపాడు సర్పంచ్ గారపాటి సౌజన్య అశోక్, ద్వారపూడి ఉప సర్పంచ్ తులా శేషారావు, సొసైటీ అధ్యక్షుడు దంతులూరి శ్రీరామ వర్మ తదితర నాయకులు పాల్గొన్నారు.