టీఆర్‌ఎస్‌ఎల్పీలో టీడీపీ విలీనం

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ పేరు కనుమరుగైంది. ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వ‌ర‌రావు త్వరలో టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో టీడీపీ శాసనసభ పక్షం విలీనమైంది. టీడీపీ శాసనసభ పక్షాన్ని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలని ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వర్‌రావు బుధవారం శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని కలిసి లేఖ అందించారు. ఈ సందర్భంగా బుధవారం మెచ్చా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డిని కలిసి టీడీపీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు లేఖ ఇచ్చారు. దీనిపై త్వరలోనే అధికారిక బులిటెన్‌ వెలువడనుంది.


సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సండ్ర వెంకట వీరయ్య కొన్నాళ్ల తరువాత టీఆర్‌ఎస్‌లో చేరారు. అశ్వారావుపేట ఎమ్మెల్యేగా మెచ్చా నాగేశ్వర్‌ రావు ఒక్కరే టీడీపీ నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు. ఆయన సైతం టీడీపీకి రాజీనామా చేశారు. త్వరలో టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై ఆయన సీఎం కేసీఆర్‌తో సైతం భేటీ అయ్యారు. శాస‌నస‌భ వ్యవ‌హారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితోనూ భేటీ అయ్యారు. స్పీకర్‌ను కలిసిన సమయంలో ఎమ్మెల్యేల మెడలో గులాబీ కండువా ఉండడం విశేషం. వారిద్దరి రాకతో తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ప్రాతినిధ్యం కరువైంది.

Leave A Reply

Your email address will not be published.