టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత

హైదరాబాద్: నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇవాళ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో దవాఖానకు తరలించారు. కాగా చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. కాగా, గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. నెలరోజుల క్రితం కరోనా బారినపడ్డారు. అయితే చికిత్స అనంతరం కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ ఆయన కోలుకోలేకపోయారు. 1956, జనవరి 9న నోముల రాములు, మంగమ్మ దంపతులకు నర్సింహయ్య జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1981లో ఎల్‌ఎల్‌బీ, 1983లో ఎంఏ పూర్తిచేశారు. 1987 నుంచి 1999 వరకు వరుసగా 12 ఏండ్లపాటు నకిరేకల్ ఎంపీపీగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1999, 2004లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004 నుంచి 2009 వరకు పార్టీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. 2009లో ఆయన ప్రాతినిథ్యం వహించిన నకిరేకల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అయ్యింది. దీంతో అప్పుడే ఏర్పడిన భువనగిరి లోసభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 2014లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
జానారెడ్డి విజయయాత్రకు బ్రేక్
అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుంచి పోటీచేశారు. కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేత జానారెడ్డి చేతిలో కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2018లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది.. జానారెడ్డి విజయయాత్రకు బ్రేక్ వేశారు. నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్రతో ముందుకు సాగుతున్నారు. నోముల హఠాన్మరణంతో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.
సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి
ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా నిలిచి పోతారని సీఎం అన్నారు. ఆయన మరణం టీఆర్‌ఎస్ పార్టీకి, నియోజక వర్గం ప్రజలకు తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నోముల నర్సింహయ్య మృతి పట్ల భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. నల్గొండ జిల్లా ఒక మంచి నిస్వార్థ రాజకీయ నాయకుడిని కోల్పోయిందని వివరించారు. ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన నర్సింహయ్య లోటును ఎవరు తీర్చలేరన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నాగార్జున సాగర్ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య అంత్యక్రియలు బుధవారం నకిరేకల్ మండలంలోని పాలెం గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.