డిసెంబరు 25 నుండి తిరుమల వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో ఈ నెల 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ మేరకు ఏర్పాట్లు చేయడం జరిగిందని టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్. జవహర్‌రెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం అనంతరం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు.
టోకెన్లు లేని భక్తులను అనుమతించబడదని టీటీడీ ఈవో పేర్కోన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ప్రముఖులకు వారికి కేటాయించిన సమయంలో, అదేవిధంగా వారికి నిర్ణయించిన ప్రవేశమార్గాల్లో ఉదయం 3 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1కు చేరుకుని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా ఆయన కోరారు. వీరందరూ కూడా శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం ఆవరణలోని కౌంటర్లలో వసతి మరియు దర్శనానికి సంబంధించిన టోకెన్లు పొందవలసిందిగా విజ్ఞప్తి చేసారు. డిసెంబరు 25న రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ప్రముఖులు స్వయంగా వచ్చిన వారికి మాత్రమే టికెట్లు కేటాయించబడును. వారితో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులకు వెరసి మొత్తం 6 గురికి మాత్రమే దర్శనం టికెట్లు ఇస్తామని తెలిపారు.ఇతర విఐపిలకు నలుగురికి మాత్రమే దర్శనం టికెట్లు కేటాయిస్తామన్నారు.
ఈ 10 రోజుల్లో బ్రేక్ దర్శనం మరియు శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందించే దాతలకు టికెట్ ధర రూ.1000 గా నిర్ణయించామన్నారు. ప్రముఖులు, వీఐపీల సిఫార్సులపై డిసెంబరు 25 నుండి జనవరి 3వ తేదీ వరకు బ్రేక్ దర్శన టికెట్లు కేటాయించబడవన్నారు. మిగిలి 8 రోజుల్లో పరిస్థితిని బట్టి పరిమిత సంఖ్యలో అనుమతించడం జరుగుతుందని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని అనేక ట్రస్టులకు విరాళాలు అందించిన దాతలకు కూడా ఈ సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించడం జరుగుతోందన్నారు. కావున దాతలు వారికి నిర్దేశించిన టైంస్లాట్లను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకుని రావాల్సిందిగా కోరారు. చిత్తూరు, తిరుపతిలోని స్థానికుల కోసం ఈ నెల 24 నుంచి మహాతి, బైరాగిపట్టెడె, ఎంఆర్‌పల్లెలో టిక్కెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. టికెట్ లేనివారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమన్నారు