తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన బురేవి తుపాను

చెన్నై: ఐఎండి సూచనల మేరకు, బురేవి తుపాను నేపథ్యంలో.. ముందుగానే తమిళనాడు, దక్షిణ కేరళ ప్రాంతాలకు అధికారులు రెడ్ అలెర్ట్ ను జారీ చేశారు. ఈ బురేవి తుపాను తమిళనాడు, కేరళలో భారీ ప్రభావం చూపుతుందని భారత వాతావరణ విభాగం భావించింది. ప్రస్తుతం బురేవి తీవ్ర వాయుగుండంగా బలహీనపడి పంబన్ తీరానికి అత్యంత చేరువకు చేరింది. పంబన్ కు ఆగేయంగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తీవ్ర వాయుగుండం శుక్రవారం అర్ధరాత్రి తర్వాత రామనాథపురం, తూత్తుకుడి జిల్లా మధ్య తీరం దాటనుందని అధికారులు తెలిపారు. వాయుగుండం తీరం దాటే సమయంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భూభాగంపైకి ప్రవేశించిన తర్వాత క్రమంగా వాయుగుండం బలహీనపడుతుందని భారత వాతావరణ విభాగం వివరించింది.
ఇప్పటికే రెడ్ అలెర్ట్‌ను జారీ చేసిన తమిళనాడు, దక్షిణ కేరళ ప్రాంతాలు బురేవి బలహీనపడిన నేపథ్యంలో.. రెడ్ అలెర్ట్ కొనసాగిస్తారా, లేదా అనేదానిపై వివరాలు తెలియాల్సి ఉంది.
ఐదు జిల్లాల్లో..
తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశి, రామనాథపురం, కన్యాకుమారి జిల్లాల్లోనే ఈ తుపాన్ ప్రభా వం ఎక్కువగా ఉంది. ముందు జాగ్రత్తలతో పెనునష్టాన్ని తప్పించే చర్యలో అధికార వర్గాలు నిమగ్నమయ్యాయి. శివగంగై, మదురై, విరుదునగర్‌లలోనూ అనేక చోట్ల వర్షాలు పడుతూ వచ్చాయి. మధ్యాహ్నం తర్వాత క్రమంగా ఈ తుపాన్ నైరుతి దిశలో పయనించడం మొదలెట్టింది. సాయంత్రం ఏడు గంటల సమయంలో గంటకు 16 కి.మీ వేగంతో తీరం వైపుగా బురేవి దూసుకురావడంతో వర్షం తీవ్రత క్రమంగా పెరిగింది.
ఆ మూడు చోట్ల కల్లోలమే..
శ్రీలంకను దాటి మళ్లీ తమిళ భూభాగాన్ని తాకేందుకు బురేవి కదలడంతో అధిక ప్రభావం రామేశ్వరం, మండపం, పాంబన్ సముద్ర తీరాల్లో నెలకొంది. గంటకు 90 నుంచి వంద కి.మీ వేగంతో గాలులు వీయడం, సముద్రంలో అలల తాకడి వెరసి ప్రజల్లో ఆందోళన తప్పలేదు. ముందుగానే తీరవాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినా, ఎలాంటి విపత్తు ఎదురవుతుందో అనే ఆందోళన వీడలేదు. ఇందుకు తగ్గట్టుగానే సముద్ర తీరంలోని చెక్‌పోస్టులు, రోడ్లు దెబ్బ తిన్నాయి. పాంబన్ తీరంలో చిక్కుకున్న కొందరు జాలర్లను రక్షించారు. తీరం వైపు సమీపించే కొద్ది సముద్ర తీర జిల్లాల్లో అనేక చోట్ల వర్షాలు మొదలయ్యాయి.
రెండు రోజులు వర్షం..
బురేవి పాంబన్ – కన్యాకమారి మధ్యలో గురువారం అర్ధరాత్రి వేళ తీరాన్ని తాకనుంది. ఇది పూర్తిగా తీరాన్ని దాటేందుకు శుక్రవారం ఉదయం వరకు సమయం పట్టనుంది. దీంతో రామనాథపురం, కన్యాకుమారి తీరాల్లో అతి భారీ వర్షం పడింది. ఈ తుపాన్ తీరం దాటినా రెండు రోజులు రాష్ట్రంపై దీని ప్రభావం ఉంటుంది. తిరుచ్చి, తిరువారూర్, తంజావూరు, అరియలూరు, కడలూరు, విల్లుపురంఈరోడ్, ధర్మపురి, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లా ల్లో ఈ ప్రభావంతో వర్షాలు మోస్తరుగా పడనున్నాయి. పుదుచ్చేరిలోనూ వర్షం పడుతుండడంతో శుక్రవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.