తెరుచుకున్న షిర్డీ సాయిబాబా ఆలయం
ముంబయి: మహారాష్ట్రలోని ప్రఖ్యాత షిర్డీ సాయిబాబా దేవస్థానంతో పాటు పలు ఆలయాలు సోమవారం తెరుచుకున్నాయి. కొవిడ్ మహమ్మారి మధ్య భక్తులు ఆలయాలను సందర్శించేందుకు ప్రభుత్వం స్టాండర్స్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్ జారీ చేసింది. ఆలయాల్లో సామాజిక దూరం, ఫేస్ మాస్క్‌లు ధరించడం తప్పసరి చేశారు. షిర్డీ దేవస్థానం ట్రస్ట్ నిత్యం ఆరువేల మందికిపైగా భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తోంది. కౌంటర్లతో పాటు ఆన్‌లైన్‌లో టికెట్లు జారీ చేస్తున్నట్లు షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ తెలిపింది. 65 ఏళ్లు పైబడిన, పదేళ్లలోపు చిన్నారులకు ప్రవేశానికి అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయం, పూణేలోని దాద్‌గుషెత్ హల్వాయి గణపతి ఆలయంలో సైతం భక్తులకు అనుమతి ఇస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చిలో ఆలయాలు మూతపడ్డాయి. కేవలం ఆయా ఆలయాల్లో నిత్య పూజలు జరగ్గా.. భక్తులకు అనుమతి ఇవ్వలేదు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఆలయాల్లో భక్తులకు అనుమతి ఇచ్చారు. జూన్‌లో కేంద్రం ప్రార్థనా స్థలాలను తెరిచేందుకు అనుమతి ఇవ్వగా.. మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో మూసే ఉంచింది.
మొన్నటి వరకు ఉపాధిలేక ఖాళీగా ఉన్న పేద వ్యాపారులు సంతోషం పట్టలేక బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ ప్రమాదం ఇంకా పొంచి ఉండటంతో కోవిడ్ నిబంధనలు, ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను పాటించాల్సిందేనని సీఎం ఆదేశించారు.
మార్గదర్శకాలు
- ముఖాలకు కచ్చితంగా మాస్క్ ధరించాలి. మాస్క్ లేకుంటే ఆలయంలోకి అనుమతి ఇవ్వకూడదు.
- కరోనాకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు లేని భక్తులనే అనుమతించాలి.
- ఇద్దరి మధ్య ఆరడుగుల దూరం కచ్చితంగా పాటించాలి.
- ఏ సమయంలో ఎంతమంది భక్తులను అనుమతించాలనేది ముందే ప్లాన్ చేసుకోవాలి.
- లోనికి, బయటకు వచ్చే దారులు వేర్వేరుగా ఉండాలి.
- మందిరంలో దేవీ, దేవత విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను చేతితో తాకకుండా చూడాలి.
- ప్రార్థనా స్థలం పరిసరాల్లో భజనలు, కీర్తనలు ఆలపించే కార్యక్రమాలు నిర్వహించకూడదు.
- దర్శనం అనంతరం బయటపడే భక్తులకు చేతితో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయరాదు.
- సాధ్యమైనంతవరకు ఆలయానికి బాలింతలు, చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు రాకుండా నిరోధించాలి.
- ఆలయం ఆవరణలో భక్తులు క్రమశిక్షణతోపాటు బాధ్యతగా ప్రవర్తించాలి. ఆలయ కమిటీకి సహకరించాలి.