తెలంగాణకు రెండు భారీ పెట్టుబడులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరో రెండు భారీ పెట్టుబడులు వచ్చాయి. దీనికి సంబంధించి ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్‌ను లారస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీల ప్రతినిధులు కలిశారు. సుమారు రూ.700 కోట్ల పెట్టుబడులు పెడతామని రెండు కంపెనీల ప్రతినిధులు ప్రకటించారు. తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల కోసం గ్రాన్యూల్స్ ఇండియా రూ.400 కోట్లు, లారస్ ల్యాబ్స్ రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ కంపెనీల పెట్టుబడుల ద్వారా 1750 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ రెండు కంపెనీలకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్.. అన్ని రకాలుగా ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
హైదరాబాద్ నగరానికి చెందిన గ్రాన్యూల్స్ ఇండియా రూ. 400 కోట్ల పెట్టుబడితో 10 బిలియన్ ఫినిష్డ్ డోసులను తయారు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడి ద్వారా సుమారు 16 వందల మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఈ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ ఇంటర్మీడియట్ యూనిట్ ని హైదరాబాద్ కి దగ్గర్లో ఉన్న గాగిల్లాపూర్ వద్ద కలిగి ఉన్నది. ఈపెట్టుబడులను అధికారికంగా ప్రకటించేందుకు కంపెనీ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణప్రసాద్ మంగళవారం మంత్రి కేటీఆర్ కలిశారు. లారస్ ల్యాబ్స్ కు సంబంధించిన రూ. 300 కోట్ల పెట్టుబడులు రెండు దఫాలుగా ఉంటాయని ఆ సంస్థ సీఈవో సత్యనారాయణ చావ మంత్రి కేటీఆర్‌కు తెలియజేశారు.
పెట్టెబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన వారికి రకాలుగా సహకరిస్తాం అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. లారస్ ల్యాబ్స్ మరియు గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీలను మంత్రి కేటీఆర్ స్వాగతించారు. రెండు కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.