తెలంగాణలో ఎంట్రీకి అనుమతి తప్పనిసరి

హైదరాబాద్ (CLiC2NEWS): ఇతర రాష్ట్రాల నుంచి వైద్యం కోసం రాష్ట్రానికి వచ్చే వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రా నుంచి హైదరాబాద్‌కు చికిత్స కొసం వచ్చే కరోనా బాధితులు ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది. తెలంగాణకు వచ్చే కొవిడ్ రోగులకు సంబంధిత ఆసుపత్రులు జారీ చేసిన లెటర్స్‌తో పాటు హైదరాబాద్‌లోని వైద్య ఆరోగ్య & ప్రజారోగ్య కొవిడ్ కంట్రోల్ రూమ్ జారీ చేసిన పాస్ విధిగా ఉండాలని ప్రభుత్వం పేర్కొంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం సంబంధిత ఆసుపత్రి ఇచ్చే లెటర్‌తో పాటు విధిగా కొవిడ్ కంట్రోల్ రూమ్ ద్వారా జారీ చేయబడే పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణలోకి వచ్చే కొవిడ్ రోగులు ఈ అంశాన్ని గమనించి తమతో సహకరించాలన్నారు. పాసులు లేకుండా వచ్చి సరిహద్దులలో ఇబ్బందులు పడవద్దని సూచించారు.
ఆసుపత్రుల్లో బెడ్ దొరక్క అంబులెన్స్‌లోనే ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. బాధితుల సౌలభ్యం కోసం ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. 040-2465119, 9494438351 నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపింది.
పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో చాలా మంది వైద్యం కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. హైదరాబాద్‌లో కరోనా బాధితుల తాకిడి పెరగడంతో రెండు రోజుల కిందట పోలీసులు సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఆపేశారు. దీంతో బాధితులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.