తెలంగాణ వ్యాప్తంగా 6 % తగ్గిన నేరాలు: డీజీపీ మహేందర్‌రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదికను డిజిపి మహేందర్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ అభయహస్తంలా సేవలందిస్తున్నామన్నారు. డయల్ 100, డయల్ 112 ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నామని, ఫిర్యాదు వచ్చిన ఎనిమిది నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లు, ఏరియాల్లో ఒకే రకమైన సేవలు అందించేందుకు ఫంక్షనల్ వెర్టికల్ సిస్టమ్ అమలు ద్వారా పోలీసుల సేవలు మరింత మెరుగుపరిచామన్నారు. ప్రతి ఉద్యోగి పనితనాన్ని మెరుగుపరిచేందుకు స్కిల్ డెవలప్మెంట్, స్పెషలైజేషన్ తీసుకువచ్చేందుకు ఫంక్షనల్ వెర్టికల్స్ ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. పోలీస్ సేవలు అవసరమైన ప్రతి ఒక్కరూ వినియోగించుకునేందుకు, మరింత సులువుగా అందుబాటులో ఉండేలా సామాజిక మాధ్యమాలు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, హాక్ ఐ ద్వారా అవగాహన కల్పించి, ఫిర్యాదులు తీసుకుంటున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. తెలంగాణలో నేరం చేస్తే దొరికిపోతామని, శిక్షపడుతుందనే అనే భయాన్ని నేరస్థుల్లో తీసుకువచ్చామని చెప్పారు. రాష్ట్రమంతా పీపుల్స్ ఫ్రెండ్లీ, స్మార్ట్ పోలీసింగ్ విధానం తీసుకువచ్చి ప్రజలకు మరింత చేరువైనట్లు చెప్పారు.
సమష్టి కృషితో మావోలకు అడ్డుకట్ట
రాష్ట్రంలోకి మావోయిస్టుల పునః ప్రవేశాన్ని సమష్టి కృషితో అడ్డుకున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. గత సంవత్సర కాలంలో ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రంలోకి పోలీసులు వచ్చేందుకు ప్రయత్నించారని, వారిని అడ్డుకున్నామన్నారు. తెలంగాణలో రాష్ట్ర కమిటీ ఉండాలన్న మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ ఆదేశాల మేరకు.. రాష్ట్రంలోకి వచ్చేందుకు ప్రయత్నించిందన్నారు. ఇంటర్ స్టేట్ బార్డర్, డిస్ట్రిక్ట్ గార్డ్స్, గ్రేహౌండ్స్, ఎస్ఐవీ, జిల్లా పోలీసులు నియంతరం ఆపరేషన్లు వారిని అడ్డుకున్నారన్నారు. ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో 11 కాల్పుల ఘటనలు జరిగాయని, ఇందులో 11 మంది మృతి చెందారని, అలాగే మరో 135 మందిని అరెస్టు చేశామన్నారు. ఇందులో స్టేట్ కమిటీ, జిల్లా కమిటీ మెంబర్లు, ఏరియా కమిటీల సభ్యులను అరెస్టు చేసినట్లు చెప్పారు.
ఆరు శాతం తగ్గిన నేరాలు
గతేడాదితో పోలిస్తే ఈ సారి రాష్ట్రంలో ఆరు శాతం నేరాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. హత్యల్లో 8.59శాతం, ప్రాపర్టీ క్రైమ్‌లో 21శాతం, దోపిడీల్లో 28, రాబరి 33శాతం, చైన్‌స్నాచింగ్ 46శాతం తగ్గాయని చెప్పారు. అలాగే మహిళలపై నేరాలు 1.92శాతం, వైట్‌కాలర్ నేరాలు 42శాతం, రోడ్డు ప్రమాదాలు 13.9శాతం తగ్గాయన్నారు.