త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు, పెన్షన్లు: మంత్రి కెటిఆర్

వరంగల్ : తెలంగాణ ప్రజలకు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు అందిస్తామని రాష్ట్ర పురపాలక మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. సోమవారం వరంగల్అలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా కేసీఆర్ తమ నాయకుడు అని భారీగా ప్రజలు తరలివచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వరంగల్ ప్రజల ఆశీర్వాదం సీఎం కేసీఆర్‌కు ఉండాలన్నారు. వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం సంవత్సరానికి రూ. 300 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఒక్క మంచినీటి కోసం రూ. 1,580 కోట్లు ఖర్చు పెట్టుకున్నామని తెలిపారు. పట్టణంలోని ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాంపూర్ వద్ద మిషన్ భగీరథ వాటర్ ట్యాంకును ప్రారంభించుకున్నామని తెలిపారు. రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామన్నారు. వరంగల్ నగరాన్ని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యత తమది అని స్పష్టం చేశారు. ఎన్నిక ఏదైనా కేసీఆరే మా నాయకుడు అని ఇప్పటి వరకు ఎలా తీర్పు ఇచ్చారో.. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆ రకమైన తీర్పును ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రానికి కేంద్రం మొండి చెయ్యి
వరంగల్ అభివృద్ధికి బీజేపీ చేసిందేమీ లేదన్నారు. నల్లధనం తీసుకొచ్చి పేదల ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ చేస్తామన్న ప్రధాని మోదీ మాట ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర కొత్తగా ఏర్పడినప్పుడు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఇవ్వలేదు. తెలంగాణకు బీజేపీ మొండి చెయ్యి చూపిస్తుందన్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు రూ. 440 ఉంటే ఇవాళ సిలిండర్ ధర రూ. 1000కి వచ్చిందన్నారు. ఇవి మంచి రోజులు కాదు.. చచ్చే రోజులు అని కేటీఆర్ విమర్శించారు. మోదీ హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో కూరగాయల ధరలు కూడా పెరిగాయన్నారు.