దుబ్బాకః కాంగ్రెస్‌లో వీడ‌ని ఉత్కంఠ‌!

దుబ్బాక: దుబ్బాక అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్‌లో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డితో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతోంది. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డినే అభ్యర్థిగా ప్రకటించాలని మొదట పీసీసీ నిర్ణయించింది. ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో చెరుకు శ్రీనివాస్‌రెడ్డి టచ్‌లోకి వచ్చారు. దుబ్బాక ఎన్నికల్లో తన పేరు అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీలోకి వస్తానని షరతు విధించారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో.. చెరుకు శ్రీనివాస్ రెడ్డి రహస్య మంతనాలు జరుపుతున్నారు.
కాగా దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్‌రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉంది. దీనిపై కాంగ్రెస్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించి శ్రీనివాస్‌ రెడ్డి భంగపడ్డారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణికే టికెట్‌ ఇచ్చేందుకే టీఆర్‌ఎస్‌ అధిష్టానం మొగ్గుచూపుతోంది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపం చెందిన శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ పెద్దల టికెట్‌ హామీ మేరకు పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని స్థానిక నేతల ద్వారా తెలుస్తోంది. ఇదిలావుండగా ఆయన చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్పడం గమనార్హం​.

Leave A Reply

Your email address will not be published.