దుబ్బాకలో టీఆర్ఎస్లో చేరిన బీజేపీ నేతలు

సిద్దిపేట : దుబ్బాకలో `గులాబీ` ఆకర్ష్ నడుస్తోంది. ఇప్పుడంతా అక్కడ చేరికల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడి పలువురు సీనియర్లు టీఆర్ఎస్లో చేరిన విషయం మనకు తెలిసిందే. నిన్న ఆ పార్టీ సీనియర్ నాయకుడు మద్దుల నాగేశ్వర్ రెడ్డి కూడా గులాబీ గూటికి చేరిన విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో భారీ సంఖ్యలో బిజెపి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నారు. తాజాగా రాయపోల్ మండలానికి చెందిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బాల్‌లక్ష్మీ, దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు సురేశ్‌తో పాటు మరో 200 మంది కార్యకర్తలు మంత్రి హరీష్‌రావు సమక్షంలో టీఆర్ెస్ పార్టీలో చేరారు. వీరందరికి మంత్రి హరీష్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
(తప్పక చదవండిః టీఆర్ఎస్లో చేరిన మద్దుల నాగేశ్వర్ రెడ్డి)
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నిన్న నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ గల్లంతు అయింది.. రేపు దుబ్బాకలో కూడా అదే జరుగుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వృద్దులు, వితంతువులు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ల విషయంలో బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేంద్రం పెన్షన్లు ఎంత ఇస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. రూ. 200ల పెన్షన్ నుంచి రూ. 2 వేల పెన్షన్‌కు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాగా దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.