దుబ్బాక ఉప ఎన్నికః ఏర్పాట్లపై కమిషనర్ ఆరా..

దుబ్బాకః త్వరలో జరుగనున్న దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ ను గురువారం సందర్శించిన పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ ఐపిఎస్. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు, మరియు గత ఎన్నికల్లో జరిగిన ఎలక్షన్ కేసుల గురించి ఎస్ఐ శ్రీనివాస్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామానికి కేటాయించిన విపిఓల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎస్ఐ శ్రీనివాస్, మరియు పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ. విపిఓలు తరచుగా గ్రామాలను సందర్శించి, ఎలక్షన్స్ కు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరించాలన్నారు. గత ఎన్నికలలో గొడవలు జరిగిన గ్రామాలలో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. గత ఎన్నికలలో కేసులు నమోదైన వారి పైన, మరియు చెడు నడతగల వారిని విడతలవారీగా బైండోవర్ చేయాలన్నారు. ప్రతి విపిఓ గ్రామాలను సందర్శించినప్పుడు, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, యువజన సంఘాలతో కలసి వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకుని గ్రూప్ లలో సమాచారాన్ని పంపించాలన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఏ విధంగా పని చేస్తున్నాయో తనిఖీ చేయాలన్నారు, పనిచేయని సీసీ కెమెరా సీసీ కెమెరాలు వెంటనే రిపేర్ చేయించాలన్నారు. సీసీ కెమెరాలు లేని గ్రామాల్లో గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులతో కలిసి త్వరగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. గొడవలు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. గ్రామస్తులతో సత్సంబంధాలు ఏర్పరుచుకుని, గ్రామములో ఏచిన్న సంఘటన జరిగినా సమాచారం వచ్చే విధంగా ఇన్ఫర్మేషన్ వ్యవస్థను పెంపొందించుకోవాలన్నారు. పోలింగ్ లొకేషన్లు, పోలింగ్ కేంద్రాలు, రూట్ మొబైల్ గురించి ప్రతి ఒక్కరికి పూర్తి అవగాహన ఉండాలన్నారు. హైపర్ క్రిటికల్, క్రిటికల్ నార్మల్ గ్రామాల గురించి, మరియు ట్రబుల్ మంగర్స్, పాత నేరస్తుల గురించి మరియు గత ఎన్నికలలో నేరాలు చేసిన వ్యక్తుల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపినారు. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల సమయంలో గోడవలను సృష్టించే వ్యక్తులను గుర్తించాలని, వారి కదలికలపై నిఘా పెట్టాలని. ముఖ్యంగా ఎన్నికల వేళ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ఏవరైనా పాల్పడితె వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. కరోనా వ్యాధి బారిన పడకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించి, శానిటైజర్ వెంబడి ఉంచుకోవాలి, మరియు గ్రామాలలో సందర్శించే టప్పుడు భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ సమావేశంలో సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, దుబ్బాక సిఐ హరికృష్ణ గౌడ్, మిరుదొడ్డి ఎస్ఐ శ్రీనివాస్, మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.