దేశ‌మంతా హైద‌రాబాద్‌వైపు చూస్తోంది: కెటిఆర్‌

హైద‌రాబాద్‌: దేశం మొత్తం హైద‌రాబాద్ వైపు చూస్తోంద‌ని తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ అన్నారు. గురువారం ఉద‌యం హైద‌రాబాద్ ప్రెస్‌క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన `మీట్ ది ప్రెస్‌`కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అయన సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో రోజుకు 50వేలమంది పేదలకు అన్నపూర్ణ ద్వారా నాణ్యమైన భోజనాలు అందిస్తున్నామని, లక్ష బెడ్ రూమ్ లను కడుతున్న ఏకైక నగరం హైదరాబాద్ అని అన్నారు. గత ఆరున్నర ఏళ్లలో హైదరాబాద్ ఎలాంటి కర్ఫ్యూలు లేవని, బాంబు పేలుళ్ల వంటివి లేవని అన్నారు. దుర్గం చెరువు బ్రిడ్జ్ ఇప్పుడు నగరానికి ఐకాన్ గా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత 2 లక్షల కోట్లు పెట్టుబడులుగా వచ్చాయని అన్నారు. సామాన్యుడి ప్రభుత్వంగా పాలన అందిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. నగరంలో కొన్ని చోట్ల భూసమస్యలు ఉన్నాయని వాటిని టిఆర్ఎస్ సర్కార్ పరిష్కరించగలదని అన్నారు. రెండోదశ మెట్రోను తామే పూర్తి చేస్తామని అన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్ నగరం కేరాఫ్ అడ్రస్ గా మారిందని అన్నారు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో 150 స్థానాల్లో పోటీచేస్తామని గత ఎన్నికల్లో పాతబస్తీలో 5 స్థానాల్లో విజయం సాధించామని, ఈసారి 10 గెలుస్తామని అన్నారు. మజ్లీస్ తో తమకు పొత్తు ఎలాంటి పొత్తు లేదని కేటీఆర్ పేర్కొన్నారు.

హైద‌రాబాద్‌ అభివృద్ధికి రూ. 67 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టాం. రెండు, మూడు రోజుల్లో ఆ వివ‌రాలు విడుద‌ల చేస్తాం. ప్ర‌జ‌ల మీద ఒక పైసా కూడా భారం మోప‌లేదు. ఎలాంటి బిల్లులు పెంచ‌లేదు. రాష్ర్ట ఆదాయం పెంచి సంక్షేమ కార్య‌క్ర‌మాల ద్వారా పేద‌ల‌కు సాయం చేశాం.. ప‌న్నులు పెంచ‌లేదు.. ఇబ్బంది పెట్ట‌లేదు. ప్రాప‌ర్టీ ట్యాక్స్, వాట‌ర్ బిల్లులు, ఎల‌క్ర్టిసిటీ బిల్లులు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ర్టేష‌న్ ఛార్జీలు, ట్రేడ్ లైసెన్స్ ఛార్జీలు పెంచ‌లేదు అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

పెట్టుబ‌డుల‌కు హైద‌రాబాద్ అయ‌స్కాంతం

రాష్ర్టంలో ల‌క్ష‌లాది ఉద్యోగాలు క‌ల్పించే దిశ‌గా ముందుకెళ్తున్నామ‌ని తెలిపారు. పెట్టుబ‌డుల‌కు హైద‌రాబాద్ అయ‌స్కాంతంగా మారింది. సుస్థిర ప్ర‌భుత్వం వ‌ల్లే ఇది సాధ్య‌మ‌వుతుంది. టాస్క్ ద్వారా పిల్ల‌ల‌కు శిక్ష‌ణ ఇప్పించి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు. అన్న‌పూర్ణ ద్వారా 50 వేల మందికి నాణ్య‌మైన బోజ‌నం అందిస్తున్నాం. ల‌క్ష డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి. భార‌త‌దేశంలో ఇలాంటి ఇండ్ల‌ను ఏ రాష్ర్టం నిర్మించ‌లేదు. 9714 కోట్ల రూపాయాల‌తో ల‌క్ష డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు క‌డుతున్నాం. ఇలాంటి న‌గ‌రంలో భార‌త్‌లో ఎక్క‌డైనా ఉన్నాదా? అని స‌వాల్ చేస్తున్నా. అతి త్వ‌ర‌లోనే నిరుపేద‌లుకు ఇండ్లు కేటాయిస్తాం. ల‌క్ష కుటుంబాల‌కు ప‌ట్టాలు ఇచ్చామ‌న్నారు. లాక్‌డౌన్‌లో నిరుపేద‌లుకు రూ. 1500 ఇచ్చి ఆదుకున్నాం. వ‌ల‌స‌కూలీల‌ను కూడా క‌డుపులో పెట్టుకున్నాం. వ‌ల‌స కూలీలు రాష్ర్ట అభివృద్ధిలో భాగ‌స్వామ్యం ఉంది అని సీఎం అన్నారు. కూలీల ప‌ట్ల సీఎం కేసీఆర్ ఔదార్యం చూపారు. శ్రామిక్ రైళ్ల‌ను ఏర్పాటు చేసి ఒక్క రూపాయి తీసుకోకుండా వ‌ల‌స కూలీల‌ను స్వ‌స్థ‌లాల‌కు పంపించాం. బ‌స్తీ ద‌వాఖాన‌లు అద్భుతంగా ప‌ని చేస్తున్నాయి. గ‌తంలో పేద‌వాడికి సుస్తీ చేస్తే దిక్కులేదు. వేల మందికి ర‌క్త‌, మూత్ర తదిత‌ర ప‌రీక్ష‌లు చేస్తున్నాం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.