దేశవ్యాప్తంగా ఉచితంగా కోవిడ్ టీకా: కేంద్ర మంత్రి హర్షవర్ధన్
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ దేశమంతా ఉచితంగానే అందిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ ప్రకటించారు. ఇవాళ (శనివారం) ఢిల్లీలో టీకా డ్రై రన్ సందర్భంగా ఆయన ఓ హాస్పిటల్‌ను సందర్శించారు. ఆ తర్వాత ఆయన మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. “ఒక్క ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాను ఉచితంగా పంపిణీ చేస్తాం“ అని మంత్రి తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఢిల్లీలోని జీటీబీ దవాఖానలో డ్రైరన్ ప్రక్రియను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. టీకా భద్రత, సామర్థ్యాన్ని నిర్ధారించడం తమ ప్రాధాన్యత అని చెప్పారు. పోలియో టీకా సమయంలో వివిధ రకాల పుకార్లు వ్యాపించాయి. కానీ ప్రజలు టీకా తీసుకున్నారు. దీంతో భారత్ ఇప్పుడు పోలియో రహిత దేశంగా మారిందని చెప్పారు. మరో వైపు దేశవ్యాప్తంగా నేడు టీకా డ్రైరన్ చేపట్టారు. 116 జిల్లాల్లోని 259 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్ మాక్‌డ్రిల్ శనివారం ఉదయం ప్రారంభమైంది. టీకా పంపిణీ కోసం ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థల పనితీరును ఈ డ్రైరన్‌లో అధికారులు విస్తృతంగా పరిశీలిస్తున్నారు.