ద్వారపూడి లో తోట త్రిమూర్తులు పర్యటన
ముంపు ప్రాంతాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ..

మండపేట: వర్షాలకు ద్వారపూడి శివారు పంగిడి చెరువు నిండిపోయి వరద నీరు ఆ గ్రామాన్ని ముంచెత్తింది. సోమవారం రాత్రి పరిస్థితి మరీ తీవ్రంగా మారి గ్రామంలోని లోటట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటే మరిన్ని ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని అక్కడి ప్రజలు ఆందోళన పడ్డారు. అయితే ఉదయానికి తుఫాను తీవ్రత తగ్గి తీరం దాటింది. దీంతో అక్కడి ప్రజలు కొంతమేర ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో నియోజక వర్గ వైసిపి ఇన్ చార్జి తోట త్రిమూర్తులు ఆ గ్రామాన్ని సమీక్షించారు. నీట మునిగిన ప్రాంతాలన్నీ అక్కడి స్థానిక నాయకులను వెంట తీసుకొని పర్యటించారు. ఎక్కువ లోతట్టు ప్రాంతాల్లో ట్రాక్టర్ పై పర్యటన చేస్తూ పరిస్థితిని పరిశీలించారు. మోకాళ్లోతున్న కొన్ని ప్రాంతాల్లో నడిచి తిరిగారు. స్థానికులు ఆయనకు ప్రతి ఏటా వాటిల్లే ముంపు అంశాలను వివరించారు. ఇకనైనా తమ కష్టాలు గట్టెక్కించాలని వేడుకున్నారు. త్రిమూర్తులు స్పందిస్తూ పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
మూడు పర్యాయాలు ఎమ్మెల్యే గా పనిచేసిన వేగుళ్ల జోగేశ్వరరావు ముంపు కు పరిష్కారం చూపలేక పోయారన్నారు. మోకాలి లోతున ఇళ్లు మునిగి పోయాయన్నారు. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగించడం చాలా బాధాకంగా ఉందన్నారు. గత పాలకులకు కాంట్రాక్టులు పేరుతో దోచుకు తినడం సరిపోయిందని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం తరపున తాను డ్రెయినేజీ వ్యవస్థ మెరుగుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ దృష్టిలో పెట్టి శాశ్వత పరిష్కారానికి పాటు పడతానని అన్నారు. ముంపు సమస్యతో పాటు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తానని భరోసా కల్పించారు. పాతికేళ్లుగా పడుతున్న ప్రజలు కష్టాలు తీర్చడానికి ముఖ్య మంత్రి జగన్ కంకణం కట్టుకున్నారని స్పష్టం చేశారు. దీనిపై అధికారులకు వర్తమానం పంపడం జరిగిందని వారితో సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటానన్నారు. అనంతరం బాధితులకు కార్యకర్తలు పులిహోర పొట్లాలు అందజేశారు. ఆయన వెంట మండల కన్వీనర్ పిల్లా వీర బాబు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.