ధౌలిగంగ విషాదంపై ఐఖ్యారాజ్యసమితి సెక్రటరీ జనరల్ దిగ్ర్భాంతి
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని ధౌలిగంగ జలప్రళయంపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఉత్తరాఖండ్‌లో హిమానీనదం విరిగిపడటంతో దౌలిగంగ నదిలో వరదలు పోటెత్తడం వల్ల 12 మందికిపైగా మృతిచెందడం, పెద్ద సంఖ్యలో జనం తప్పిపోవడంపై విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. భారత్‌కు అన్నివిధాలా అండగా ఉంటామని ప్రకటించారు. అవసరమైతే సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే ధౌలిగంగ దుర్ఘటనపై భూటాన్ ప్రధాని లొటే థెరింగ్ స్పందించారు. వరదల్లో మృతిచెందినవారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని చెప్పారు. తప్పిపోయినవారు క్షేమంగా తిరిగిరావాలని ఆకాంక్షించారు. భారత్‌లోని మిత్రులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పారు.
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోని జోషిమఠ్ వద్ద ఆదివారం నందాదేవి హిమానీనదం విరిగిపడటంతో గంగానది ఉపనదులైన ధౌలిగంగా, రిషిగంగా, అలకనందకు ఆకస్మికంగా భారీ వరదనీరు పోటెత్తింది. నీటి ఉద్ధృతికి రెండు పవర్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. వాటిల్లో పనిచేస్తున్న కార్మికులు గల్లంతయ్యారు. ఇప్పటివరకు 14 మృతదేహాలు లభ్యమయ్యాయి. తపోవన్ ప్రాజెక్ట్ టన్నెల్లో చిక్కుకుపోయిన 16 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. ఇంకా 170 మందికిపైగా జాడ లభించలేదని అధికారులు వెల్లడించారు. వారంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సిబ్బంది, పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా సహాయక చర్యలు చేపట్టారు. అలాగే గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.