`ధరణి`పై రేపు తహసీల్దార్లకు శిక్షణ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ నెల 29న సిఎం కెసిఆర్ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే ధరణి ప్రారంభం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని తహసీల్దార్లకు, డిప్యూటీ తహసీల్దార్లకు ఘట్‌కేసర్‌లో రేపు (మంగళవారం) శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు దాదాపు పూర్తి చేశారు. రిజిస్ట్రేషన్లను సులభతరం చేయడానికి, భూ రిజిస్ట్రేషన్లలో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను రూపొందిస్తోంది. దీని ఫలితంగా ఒకే రోజులో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తయి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. అటు.. ధరణి ట్రయల్స్ కొనసాగుతూనే ఉన్నాయి. తహసీల్దార్లు ఈ నెల 18 నుంచే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియపై సాధన చేస్తున్నారు. ఇప్పటివరకు ఒక్కో తాసిల్దార్ సగటున 20కిపైగా ట్రయల్స్ నిర్వహించారు, ఇంకా ట్రయల్స్ కొనసాగుతున్నాయి.