నకిలీ ఫేస్ బుక్ అకౌంట్స్ ముఠా అరెస్ట్
-డిఐజి రంగనాథ్

ఫేస్ బుక్ సెక్యూరిటీ లోపాలు, యూజర్ల అజాగ్రత్త వల్లనే హెచ్చు మీరుతున్న సైబర్ నేరాలు
దేశ వ్యాప్తంగా 350 మంది పోలీస్ అధికారుల పేరుతో నకిలీ అకౌంట్స్, సులభంగా డబ్బు సంపాదించడం కోసం దక్షిణాది రాష్ట్రాలే లక్ష్యంగా సైబర్ నేరాలు
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
Olx, Face book అప్లికేషన్స్ అడ్డాగా నేరాలు, ఆర్మీ పేరుతోనూ సైబర్ నేరాలు
లక్ష నగదు, ఎనిమిది మొబైల్ ఫోన్లు, ఒక లాప్ టాప్, 30 సిమ్ కార్డులు, నకిలీ ఆధార్ కార్డులు, పలు డాక్యుమెంట్లు స్వాధీనం
నల్లగొండ : పోలీస్ అధికారులతో పాటు లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడుతూ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ ఫేస్ బుక్ అకౌంట్స్ తయారు చేసి వారి స్నేహితులకు మెసెంజర్ ద్వారా డబ్బులు పంపమని మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను చాకచక్యంగా అరెస్ట్ చేసినట్లు డిఐజి, నల్లగొండ ఎస్పీ ఏ.వి.రంగనాధ్ చెప్పారు.
శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముఠా పాల్పడిన సైబర్ నేరాలు, ఇప్పటి వరకు క్రియేట్ చేసిన నకిలీ ఫేస్ బుక్ అకౌంట్స్, వారి వద్ద నుండి సీజ్ చేసిన వస్తువుల వివరాలను వెల్లడించారు. తెలంగాణ పోలీసులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కేసును చేధించడం కోసం నల్లగొండ జిల్లా పోలీసులు రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ జిల్లా కేత్వాడ మండల కేంద్రానికి చెందిన ముస్తఖీమ్ ఖాన్, మనీష్, షాహిద్, సద్దాం ఖాన్ లను అరెస్ట్ చేసినట్లు రంగనాధ్ తెలిపారు. వీరిలో మనీష్ మైనర్ బాలుడని చెప్పారు. వీరంతా సాధారణంగా రోడ్ల మీద వెళ్లే వారిని బెదిరించి డబ్బులు లూటీ చేయడంతో పాటుగా OLX ను వేదికగా చేసుకొని ఆర్మీకి చెందిన వాహనాలు, ఇతర వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి బ్యాంక్ అకౌంట్లు, గూగుల్ పే, ఫోన్ పేల ద్వారా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకోవడం లాంటి సైబర్ మోసాలకు పాల్పడే వారని, లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్లపై వాహనాలు సరిగా నడవకపోవడం, OLX మీద కొనుగోళ్లు జరిపే ప్రజలకు కొంత అవగాహన రావడం, OLX ద్వారా ప్రజల నుండి కొనుగోళ్లు తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయంగా సులభంగా డబ్బు సంపాదించాలని భావించి మొబైల్ ఫోన్, లాప్ టాప్ ల ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పోలీస్ అధికారుల ఫేస్ బుక్ అకౌంట్లను లక్ష్యంగా చేసుకొని వారి పేరుతో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేయడం, వారి స్నేహితుల జాబితాలో ఉన్న వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడంతో పాటుగా కొందరిని మెసెంజర్ ద్వారా అత్యవసరం ఉన్నదని మెసేజ్ పంపి డబ్బులు ఫోన్ పే ద్వారా పంపించమని మెసేజులు పంపి మోసాలకు పాల్పడుతున్నట్లు వివరించారు. వీరు వినియోగించే బ్యాంక్ అకౌంట్లు, సిమ్ కార్డులు (పలు రాష్ట్రాలకు చెందినవవి) నేరాలకు వాడుతున్నారని, ఇతర వ్యక్తుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అపరిచిత వ్యక్తుల నుండి 3000 రూపాయలకు వాటిని కొనుగోలు చేసి ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఇలా దేశంలోని మన రాష్ట్రంతో పాటు కర్నాటక, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 350 మంది పోలీస్ అధికారుల ఫేస్ బుక్ నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసినట్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 81 మంది పోలీస్ అధికారుల పేరుతో నకిలీ ఎఫ్.బి. అకౌంట్లు సృష్టించారని డిఐజి రంగనాధ్ తెలిపారు. వీరిని పట్టుకోవడానికి తాము చాలా శ్రమించాల్సి వచ్చిందని అయినప్పటికి ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా తెలంగాణ పోలీసుల ప్రతిష్ట నిలిపే విధంగా సమర్ధవంతంగా వ్యవహరించి తమ బృందం రాజస్ధాన్ వరకు వెళ్లడం జరిగిందన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఫేస్ బుక్ అడ్డాగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను నల్లగొండ పోలీస్ బృందం పట్టుకున్నదని చెప్పారు. దీనిపై మరింత లోతైన విచారణ కొనసాగిస్తూ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి తెలంగాణ పోలీసులు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారన్నారు.
కేసును చేధించడంలో కీలకంగా పనిచేసిన నల్లగొండ టూ టౌన్ సిఐ ఎస్.ఎం. బాషా, రూరల్ ఎస్.ఐ. ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్స్ శంషుద్దీన్, బాలకోటిలతో పాటు సాంకేతికంగా ఎప్పటికప్పుడు సహకరించి ఐ.టి. టీమును డిఐజి రంగనాధ్ ప్రత్యేకంగా అభినందించి వారికి రివార్డు అందచేస్తామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వర్ రావు, ఎస్.బి. డిఎస్పీ రమణారెడ్డి, టూ టౌన్ ఎస్.ఐ. నర్సింహా తదితరులున్నారు.
సైబర్ నేరస్థుల ఉచ్చులో పడి మోసపోవద్దు
రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు చాలా అప్రమాత్రంగా ఉండాలని, సరైన అవగాహన కలిగి ఉండడం ద్వారా మెకేసపోకుండా జాగ్రత్త పడాలని డిఐజి రంగనాధ్ సూచించారు. ముఖ్యంగా ఫేస్ బుక్, వాట్స్ అప్, మెసెంజర్ చాటింగ్స్ పట్ల శ్రద్ధ వహించాలని, అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే రిక్వెస్టులకు స్పందించవద్దని, నకిలీ ఐడీలతో ఎవరైనా డబ్బులు పంపించమని కోరితే ఫోన్ చేసి తెలుసుకోవాలని ఆయన సూచించారు. సైబర్ నేరగాళ్ల కొత్త కొత్త ఆలోచనలు, వారు మోసం చేస్తున్న విధానాల పట్ల పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా, ప్రకటనల ద్వారా అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్యం చేస్తూనే ఉన్నదని వివరించారు. సైబర్ నేరాలు పెరిగిపోతున్న క్రమంలో సామాజిక మాధ్యమాలు, మొబైల్ ఫోన్ వినియోగం పట్ల జాగ్రత్తలు వహిస్తూ మోసపోకుండా తెలివిగా వ్యవహరించాలన్నారు.