నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చిరుతల కలకలం

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మాట్లూర్ మండలం మాదాపూర్, కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లి శివార్లలో చిరుతల సంచారం కలకలం రేపుతున్నది. దాంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే సింగరాయిపల్లిలో రెండు దూడలపై చిరుత దాడి చేసి హతమార్చడంతో రాత్రివేళ బయటకు వెళ్లాలంటే స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు.
(తప్పకచదవండి: బావిలో పడ్డ చిరుత పులి..)
కాగా కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ అటవీ ప్రాంతంలో ఇటీవల చిరుత ఓ మేక పిల్లను హతమార్చి ఎత్తుకెళ్లింది. మాట్లూర్ మండలం మాదాపూర్ శివారులోని గుట్టల్లో ఏడాదికి చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు.
రైతులు, పశువుల కాపర్లు పొలాల వైపు వెళ్లేందుకు జంకుతున్నారు. స్థానికులు సమాచారంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుత జాడ కోసం ప్రయత్నిస్తున్నారు. రాత్రివేళ ఎవరూ శివారు ప్రాంతాలకు వెళ్లవద్దని, పొలాలకు వెళ్లే రైతులు, జీవాల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా చిరుతను గుర్తించి పట్టుకుంటామని అటవీ అధికారులు తెలిపారు.