నీరు, ఫుడ్ పాయిజన్ లాంటివి ఏమీ జరగలేదు: మంత్రి ఆళ్ల నాని
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురవుతున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తెలియని వ్యాధితో ఎక్కడివారు అక్కడే నోట్లో నురగలు కక్కుతూ స్పృహ కోల్పోతున్నారు. ఇప్పటి వరకు 270 కేసులు నమోదయ్యాయని, ఆరోగ్యం మెరుగుపడటంతో 117 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాల్లో 108 వాహనాలు సిద్ధంగా ఉంచామని చెప్పారు.
‘విజయవాడ ఎయిమ్స్ నుంచి ప్రత్యేక వైద్య బృందం వచ్చింది. నిపుణుల బృందాలు కూడా ఏలూరుకు వస్తున్నాయి. నీరు, ఫుడ్ పాయిజన్ లాంటివి ఏమీ జరగలేదు. చికిత్స తర్వాత ఒకట్రెండు గంటల్లోనే సాధారణ స్థితికి వస్తున్నారు. ఫిట్స్ వచ్చిన వారికి సంబంధిత మందులు ఇస్తున్నాం. సీఎం జగన్ కార్యాలయం నుంచి గంట గంటకు ఇక్కడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని మంత్రి తెలిపారు. సోమవారం ఆయన ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శిస్తారు.