అటు నుస్తులాపూర్ ఇటు న్యూజిలాండ్

టి.వేదాంత సూరి: తెగ‌ని జ్ఞాప‌కాలు

చాలా ఏళ్లుగా బతుకమ్మ పండుగకు న్యూజిలాండ్ లో వుండాలని అనుకుంటున్నాను. ఈ సారి కరోనా పుణ్యమా అని ఆ అవకాశం వచ్చింది. బతుకమ్మ పండుగను నేను బాల్యం లో కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ లో చూసిన సంబరాలు ఇక్కడ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఆ ఊరు లేదు జ్ఞాపకాలు తప్ప. బాల్యం లో పొందిన అనుభూతులు గుర్తు తెచ్చుకోవాలంటే మా ఊరికి వెళ్ళాలి. అంటారు. కానీ మా ఊరు లోయర్ మానేరు డ్యాం లో మునిగి పోయింది. దాంతో ఆ ఊరు, అక్కడి మనుషులతో సంబంధాలు తెగి పోయాయి కానీ నాటి జ్ఞాపకాలు మాత్రం మదిలో పదిలం గానే వున్నాయి. బతుకమ్మ, దసరా పండుగ వచ్చిందంటే ఎవరెవరు ఎక్కడున్నా. తమ ఊరికి రావలసిందే. బతుకమ్మ ఎంగిలి పూలు మొదలు కొని సద్దుల బతుకమ్మ దాకా రాజంతా సందడే. పొద్దంతా పూల వేట. సాయంకాలం ఆడపిల్లల ఆట. రోజూ ఒక కూడలిలో ఆదుకునే వారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ కు ఊరి సర్పంచ్, పెద్ద మనుషులు ముందు నిలబడి బతుకమ్మలతో పాటు వాగుకు వచ్చేవారు.రాత్రి పది వరకు ఆది ఇంటి ముఖం ప్రతీవారు. ఇక దసరానాడు చెరువు గట్టుకు వెళ్లి పాలపిట్ట, గరుత్మంతుడిని చూసి రావడం, సాయంకాలం దేవుడి శావ తో వెళ్లి జమ్మి తెచ్చుకోవడం ఒక ఆనవాయితీ. అదే విధంగా న్యూజిలాండ్ లో రోజూ ఒక చోట బతుకమ్మ ఆడటం, తెలంగాణా ఆడ పడుచులంతా సందడి చేయడం చూస్తుంటే ఆ రోజులో గుర్తుకు వస్తున్నాయి. మా ఊళ్ళో కాలుష్యం ఉండేది కాదు. మొక్కజొన్న పెరడు, మామిడి తోట, రెండు కాలువలు, అంటే పెద్ద కాలువ, చిన్న కాలువ అనేవారం ఆ తరువాత వాగు ఉండేవి. సాయంకాలాలు ఎంతో ఉల్లాసంగా ప్రకృతి ని ఆస్వాదించేవారం. వేసవి సెలవుల్లో వాకిలిలో మంచాలు వేసుకుని ఎన్నెన్నో కబుర్లు చెప్పుకునేవారం. ఆ తరువాత, కరీంనగర్, హైదరాబాద్ లలో ఆ వాతావరణం తోపాటు, ఆప్యాయతలు దొరుక లేదు. మళ్ళీ ఆ అనుభూతులు న్యూజిలాండ్ లో పొంద‌దుతున్నాను.. పొంద గలుగు తున్నాను. చుట్టూ సముద్రపు నీరు, పచ్చని నెల. అందంగా ఆకట్టుకునే పూలు. ఎలాంటి వారికైనా ఆనందాన్ని పంచుతాయి. నా పిల్లలు అందరూ ఇక్కడే ఉండటం మరో ఆనందకర విషయం. అందుకే పాతరోజులు, ఆంటీ నా బాల్య జ్ఞాపకాలు ఇక్కడ గుర్తొస్తుంటాయి…

Leave A Reply

Your email address will not be published.