నేటి నుంచి భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్: మంగళవారం నుంచి శ్రీరామనవమి, తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రారంభం కానున్నాయి. నేటితో ఉత్సవాలు ప్రారంభమై ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కరోనా మహమ్మారి వేళ ఉత్సవాలు నిరాడంబరంగా సాగనున్నాయి. 16న శుక్రవారం రాత్రి చుట్టు సేవ, 17న సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, ఉదయం ఉత్సవ మూర్తులకు ఉత్సవాంగ స్నపనం జరుపనున్నారు. 18న షష్టి ఆదివారం శ్రీభగవద్రామానుజాచార్య స్వామివారి తిరు నక్షత్రం సందర్భంగా రామానుజాచార్య స్వామికి స్నపన తిరుమంజనం, సాయంత్రం గరుడ పటావిష్కరణ, రాత్రి శ్రీరామానుజాచార్య స్వామికి చుట్టు సేవ, విశేష భోగ నివేదన జరుపనున్నారు. 19న సప్తమి పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, దేవతాహ్వానం, బల సమర్పణ, హనుమద్వాహన సేవ నిర్వహిస్తారు.
21న సీతారాముల కల్యాణం
20న అష్టమి మంగళవారం ఉదయం యాగశాలలో పూజ, చతుఃస్థానార్చన, రాత్రి గరుడ వాహన సేవ, ఎదుర్కోలు ఉత్సవం, 21న శ్రీరామనవమి రోజున ఉదయం సీతారాముల తిరు కల్యాణోత్సవం, సాయంత్రం పునర్వసు దీక్ష ప్రారంభం, రాత్రికి చంద్రప్రభ వాహన సేవ, 22న పట్టాభిషేకం, రాత్రి రథసేవ, 23న ఏకాదశి సందర్భంగా ఉదయం చతుః స్థానార్చన, రాత్రి సదస్యం, హంస వాహన సేవ జరుపుతారు. 24న ఉదయం చతుః స్థానార్చాన, రాత్రి తెప్పోత్సవం, చోరోత్సవం, అశ్వవాహన సేవ, 25 ఆదివారం ఉదయం చతుః స్థానార్చాన, రతాత్రికసింహ వాహన సేవ, 26న చతుర్దశి, సోమవారం చిత్తా నక్షత్రం, ఉదయం వసంతోత్సవం, సుదర్శన హోమం, సాయంత్రం హవనం, గజ వాహన సేవ జరుగనుంది. 27న చక్రతీర్థం, సాయంత్రం 6 గంటలకు పూర్ణాహుతి, శేష వాహన సేవ, గరుడ ధ్వజావరోహణం, దేవతోద్వాసనం, ద్వాదశ ప్రదక్షిణ, ద్వాదశారాధనతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.