నైగర్‌లో `ఉగ్ర`దాడి: 100 మంది హతం

నైజర్: పశ్చిమాఫ్రికా దేశం నైగర్‌లో ఉగ్రవాదులు నెత్తుటేరులు పారించారు. మాలి సరిహద్దుల్లోని రెండు గ్రామాలపై ఆదివారం సాయంత్రం విచక్షణా రహితం కాల్పులకు తెగబడిన ముష్కరులు 100 మందిని పొట్టనబెట్టుకున్నారు. మాలి సరిహద్దు సమీపంలోని తోచబంగౌ, జారౌమ్‌దారే గ్రామాలపై ఉగ్రవాదులు నిన్న సాయంత్రం దాడిచేశారని అంతర్గత వ్యవహారాల మంత్రి అల్కాచే అల్హాడా తెలిపారు. మృతుల్లో 70 మంది తోచబంగౌ గ్రామానికి చెందినవారని వెల్లడించారు. మరో 75 మంది గాయపడ్డారని, వారిని రాజధాని నియామేలోని దవాఖానకు తరలించామన్నారు.
బోకోహారమ్ ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. గత శనివారం బోకోహారమ్ సంస్థకు చెందిన ఇద్దరిని గ్రామస్థులు చంపేశారు. దీంతో ప్రతికారేచ్ఛతో ఆదివారం సాయంత్రం ఆ రెండు గ్రామాలపై దాడిచేసి ఉగ్రవాదులు 100 మందిని కాల్చి చంపారని తెలిపారు. బోకోహారమ్ సంస్థకు అల్‌ఖైదాతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.