న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేదు

వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రజలు నూతన సంవత్సర వేడుకలను తమ ఇండ్లలోనే జరుపుకోవాలన్నారు. ఉరేగింపులు, ర్యాలీలు, గుంపులు గుంపులుగా గుమిగూడడం, వాహనాలపై తిరగడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కరోనా కట్టడికి ప్రభుత్వం పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, కాలనీల ప్రధాన రోడ్లతో సహ అన్ని ప్రాంతాల్లో నూతన సంవత్సర వేడుకలకు అనుమతులు లేవన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా డిసెంబర్ 31 సాయంత్రం 7 గంటల నుంచి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు.