న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టండి: రాష్ట్రాలను కోరిన కేంద్రం

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో పాటు కొత్తకొత్త వైరస్ ఇండియాలోకి ప్రవేశించిన నేపథ్యంలో ప్రమాదం పొంచి ఉన్నందున నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చేసుకునే వేడుకలపై నిషేదాజ్ఞలు విధించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. డిసెంబర్ 30, 31, జనవరి 1 స్థానిక పరిస్థితులను అంచనా వేసి..ఈ ఆంక్షలు విధించాలని కోరింది. తుది నిర్ణయం మాత్రం రాష్ట్రాలకే వదిలిపెట్టింది. గత మూడు నెలల నుండి దేశంలో యాక్టివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, అదే సమయంలో యూరప్‌తో పాటు అమెరికాలో కేసులు పెరుగుతున్న ఆందోళన మధ్య.. సమగ్రమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, కఠినమైన భద్రతా ప్రమాణాలు కొనసాగించాల్సిందేనని రాష్ట్రాలకు ఉన్నతాధికారి లేఖలో పేర్కొన్నారు. చలికాలంతో పాటు ఈ సమయంలో వచ్చే న్యూయర్, పలు పండుగలను పురస్కరించుకుని …సూపర్‌స్ప్రెడర్లుగా మారే ఈవెంట్స్, ఎక్కువ జనం గుమిగూడే ప్రాంతాలపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా అంతర్ రాష్ట్ర, ఇతర రాష్ట్ర ప్రయాణ, వస్తు రవాణాపై ఎటువంటి ఆంక్షలు లేవని చెప్పారు. పండుగ సమయాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది.