నవజాత ఆడశిశువును గోనెసంచిలో చుట్టి..
మీరట్: అత్యంత దారుణమైన, పాశవిక ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. నవజాత ఆడశిశువును ఒక సంచిలో వేసి ఊపిరాడకుండా మరో మూడు గోనెసంచుల్లో కట్టేసి రహదారిపై పడేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో శతాబ్దినగర్‌లో గుర్తించారు. తీవ్ర చలి కారణంగా శిశువు పరిస్థితి విషమంగా ఉంది. అటుపక్కగా వెళ్తున్న వారికి శిశువు ఏడుపు వినిపించింది. ఎక్కడ నుంచి వినిపిస్తోందనని చూడగా గోనెసంచి కదలడాన్ని చూసిన స్థానికులు కంగారు పడ్డారు. వెంటనే ఆ సంచిని తెరిచి చూడగా ఆడశిశువును మూడు కవర్లలో చుట్టి కనిపించింది. చాలా దారుణమైన పరిస్థితిలో శిశువు కనిపిచడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమచారం అందజేశారు. అనంతరం స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనిపై డాక్టర్ మనీషా అగర్వాల్ మాట్లాడుతూ పాపకు ఇంకా అమ్మ పాలు అందలేదని, ఇది పాప ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. తమ ప్రయత్నం తాము చేస్తున్నామని వివరించారు. పాపను ఇంత దారుణమైన పరిస్థితిలో వదిలేసిన తల్లిదండ్రులెవరోనని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా పాప తల్లిదండ్రులను వెతికే పనిలో పడ్డారు.