పిన్ లేకుండా రూ.5000 వ‌ర‌కు లావాదేవీలు

జ‌న‌వ‌రి నుంచి అమ‌ల్లోకి రానుంద‌న్న ఆర్‌బీఐ

న్యూఢిల్లీ: డిజిట‌ల్ చెల్లింపుల విష‌యంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కొవిడ్ మ‌హ‌మ్మారి ప‌రిస్థితుల‌‌లో మ‌రింత భ‌ద్ర‌మైన‌, సుర‌క్షిత‌మైన డిజిట‌ల్ లావాదేవీల‌ను అందించ‌డంలో భాగంగా కాంట‌క్ట్‌లెస్ లావాదేవీలు, ఇ- మాండేట్‌ల ప‌రిమితిని పెంచింది. ప్ర‌స్తుతం రూ. 2000 వ‌ర‌కు చెల్లింపులు, లావాదేవీలు పిన్ నంబ‌రు అవ‌సరం లేకుండా జరుపుకునే అవ‌కాశం ఉండ‌గా.. ఇప్పుడు రూ.5000కు పెంచుతున్న‌ట్లు వెల్ల‌డించింది. ప్ర‌స్తుత క‌రోనా కాలంలో డిజిట‌ల్ పేమెంట్స్ మ‌రింత సుర‌క్షిత వాతావ‌ర‌ణంలో జ‌ర‌గాల‌న్న ఉద్దేశంతో ప‌రిమితిని పెంచిన‌ట్లు ఆర్బీఐ చెప్పింది. టెక్నాల‌జీ వినియోగం ఎక్కువ కావ‌డంతో కాంటాక్ట్‌లెస్ కార్డ్ ట్రాన్సాక్ష‌న్లు, యూపీఐ పేమెంట్లు పెరిగిపోయాయ‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ అన్నారు. ఇవి డిజిట‌ల్ పేమెంట్ల‌ను మ‌రింత సుర‌క్షిత వాతావ‌ర‌ణంలో జ‌రిగేలా చూస్తాయ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్ష‌న్ల ప‌రిమితి అధికారాన్ని కూడా ఈ మ‌ధ్యే క‌స్ట‌మ‌ర్ల‌కు క‌ట్ట‌బెట్టారు. తాజా ప‌రిమితి పెంపుపై కూడా క‌స్ట‌మ‌ర్‌కే విచ‌క్షణాధికారం ఉంటుందని శ‌క్తికాంత దాస్ స్ప‌ష్టం చేశారు. ఇక రానున్న రోజుల్లో భారీ మొత్తాల లావాదేవీల కోసం ఉప‌యోగించే రియ‌ల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్టీజీఎస్‌)ను 24 గంట‌లూ అందుబాటులో ఉంచేలా చేస్తామ‌ని కూడా ఆర్బీఐ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే గ‌తేడాది డిసెంబ‌ర్ నుంచి నేష‌న‌ల్ ఎల‌క్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫ‌ర్ (నెఫ్ట్‌) 24 గంట‌లూ అందుబాటులోకి వ‌చ్చింది.

Leave A Reply

Your email address will not be published.