పీఆర్‌సీ ప్రతులను చించివేసిన ఉద్యోగులు
నివేదికపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం
హైదరాబాద్: పీఆర్సీ(తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం) సిఫార్సులకు వ్యతిరేకంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఐక్యవేదిక ఉద్యోగులు నిరసన చేపట్టారు. వారిని అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం విడుదలైన పీఆర్సీ కమిషన్ నివేదికపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం తీవ్ర వ్యక్తం చేశాయి. నివేదికకు వ్యతిరేకంగా బీఆర్కే భవన్ ఎదుట ఉద్యోగ సంఘాల ధర్నాకు దిగడమేకాక పీఆర్సీ ప్రతులను చించేశాయి. ఇక ధర్నా నేపథ్యంలో పోలీసులకు, ఉద్యోగ సంఘాలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దాంతో పోలీసులు పలువురు ఉద్యోగ సంఘం నేతలను అరెస్ట్ చేశారు. ఇక ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాగా సిఎం కెసిఆర్ ఇప్పటికైనా ఆలోచించి మంచి ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా ఉద్యోగుల మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని వేతన సవరణ సంఘం సిఫార్సు చేసినట్లు సమాచారం. పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు.