పేలిన ట్రాక్టర్ టైర్: డ్రైవర్ మృతి

దుమ్ముగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ట్రాక్టర్ టైరు పేలి డ్రైవర్ దుర్మరణం చెందిన ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని దుమ్ముగూడెం మండలం శనివారం టైర్ పేలడంతో ట్రాలితో సహా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో దుమ్ముగూడెం మండలం కేజీగూడెం గ్రామానికి చెందిన సున్నం సందీప్ (22) భద్రాచలంలో సిమెంట్ ఇటుక కొనుగోలు చేసి ట్రాక్టర్‌లో లోడ్ చేసుకొని స్వగ్రామానికి తెస్తున్నాడు. ఈ క్రమంలో దుమ్ముగూడెం మండలం రేగుపల్లి గ్రామశివారుకు రాగానే ట్రాలీ టైరు పేలడంతో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సందీప్ ఇంజిన్ కిందపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.