పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేకుంటే వాహన ఆర్సీ స్వాధీనం!

న్యూఢిల్లీ: వాహనాల కాలుష్య నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ (పీయూసీ) సర్టిఫికెట్‌ లేకపోతే వాహన రిజిస్ర్టేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్సీ)ను స్వాధీనం చేసుకోవడానికి దారితీసే వ్యవస్థను వచ్చే జనవరి నుంచి అమల్లోకి తీసుకురాబోతోంది. ఈ మేరకు అందరి సూచనలు కోరుతూ గత శుక్రవారం ముసాయిదా నోటిఫికేషన్‌ను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ జారీ చేసింది. ఈ ప్రక్రియ పూర్తికావడానికి రెండు నెలల సమయం పట్టనుంది. కొత్త వ్యవస్థలో భాగంగా వాహన యజమాని వివరాలను మోటార్‌ వాహనాల డేటాబే్‌సకు అనుసంధానించిన సర్వర్లకు అప్‌లోడ్‌ చేస్తారు. దీని మూలంగా పీయూసీ సర్టిఫికెట్‌ లేకుండా వాహనదారులు తమ వాహనాన్ని నడిపితే ఇక కష్టాలే. వాహన యజమాని వాహన పీయూసీని నిర్దేశిత గడువులోపల తప్పనిసరిగా పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ చెల్లుబాటులో లేని పీయూసీ ఉంటే వారం రోజుల గడువిస్తారు. ఆ తర్వాత కూడా సర్టిఫికెట్‌ను తీసుకోని పక్షంలో ఆర్సీని స్వాధీనం చేసుకుంటారు. వాహనాలు వెలువరించే కాలుష్యం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో దాన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వం నూతన నిబంధనలకు శ్రీకారం చుడుతోంది.

మరోవైపు వాహనాల పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ సర్టిఫికెట్‌లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వాహనాలకు ఒకేరకమైన పీయూసీ సర్టిఫికెట్‌ను త్వరలోనే ప్రవేశపెట్టాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంతిత్రత్వ శాఖ యోచిస్తోంది. ఈ సర్టిఫికెట్‌ క్యూఆర్‌ కోడ్‌తో ఉండనుంది. ఇందులో వాహన యజమాని, వాహనం, వాహన ఉద్గారాల స్థాయి వంటి వివరాలు ఉంటాయి. ఈ మార్పులను ప్రతిపాదిస్తూ గత శుక్రవారం రవాణా మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.