ప్రకృతి వనాలతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం..
కామారెడ్డి: పల్లె ప్రకృతి వనాలతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. సదాశివనగర్ మండలం భూంపల్లి, సదాశివనగర్ పల్లె ప్రకృతి వనాలను ఆయన మంగళవారం సందర్శించారు. గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయని సూచించారు. ఉదయం పూట గ్రామీణులు వాకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన వాతావరణంను అందించాలంటే పచ్చదనాన్ని పెంపొందించడంలో గ్రామపంచాయతీలు కీలక పాత్ర పోషించాలని కోరారు. రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పరిశీలించారు. కరోనా రాకుండా వ్యాధి నిరోధక టీకాలు ఎంతమందికి ఇచ్చారని వివరాలను జిల్లా వైద్యాధికారి చంద్ర శేఖర్ ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో పైప్ లైన్ లీకేజీ ఉండడంతో వైద్యాధికారి పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. రామారెడ్డి మండల కేంద్రంలో రైతు వేదిక భవనాన్ని సందర్శించారు. భవనంలో ఇంతవరకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయకపోవడం పై వ్యవసాయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, సర్పంచులు సంజీవ్, బద్దం శ్రీనివాస్ రెడ్డి, లలితా బాయ్, ఎంపీడీవోలు అశోక్, శంకర్ నాయక్, ఎంపీవోలు లక్ పతి నాయక్, సవిత, ఎపీవోలు, వ్యవసాయ అధికారులు ప్రజాపతి, హరీష్, అధికారులు పాల్గొన్నారు.