ప్రచార సభలో తేజస్వీకి చేదు అనుభవం

పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఆర్జేడీ నేత, విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్కు చేదు అనుభవం ఎదురయ్యింది. గుర్తు తెలియని ఆగంతకులు ఆయన మీదకు చెప్పులు విసిరారు. ప్రచారంలో భాగంగా ఔరంగాబాద్ జిల్లా కుటుంబ అసెంబ్లీ నియోజకవర్గంలో తేజస్వీ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. సభా వేదికపై కూర్చుని ఉండగా.. ఆకస్మాత్తుగా ఆయన వైపు రెండు చెప్పులు వచ్చి పడ్డాయి. వాటిలో ఒకటి ఆయన తల పక్క నుంచి వెళ్లి పోగా.. మరోకటి మాత్రం తేజస్వీకి తగిలి ఆయన ఒడిలో పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. అయితే అనంతరం ప్రసంగించిన తేజస్వీ ఈ విషయంపై స్పందించలేదు. అయితే ఈ ఘటనను ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యంజయ్ తివారీ ఖండించారు.