ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేద్దాం రండి

ఎంపీ  కనుమూరి రఘురామకృష్ణంరాజు

న్యూఢిల్లీః వైకాపాను ఎన్డీయేలో చేర్చుకోవాల్సిన అవసరం భాజపాకు లేదని నరసాపురం ఎంపీ  కనుమూరి రఘురామకృష్ణంరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైకాపానే ఎన్డీయేలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసమే ఎన్డీయే భాగస్వామ్యాన్ని తిరస్కరించామంటున్న వైకాపా.. ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామాలు చేయించాలన్నారు. ఎంపీలు రాజీనామా చేస్తే తాను అందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం పార్టీ ఎంపీలంతా రాజీనామా చేస్తే తాను రాజీనామా చేస్తానని వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. రాజీనామా చేయాలని విప్ జారీచేస్తే అందరితో పాటు తాను ఉంటానని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా ఎన్డీయేలోకి రావాలని భాజపా కోరినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని రఘురామ అన్నారు. వైకాపానే ఎన్డీయేలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. కేంద్రంలోకి రావాలని బతిమాలారని వైకాపా నేతలు అంటున్నారు. ప్రత్యేక హోదా కోసం వదులుకున్నామని చెబుతున్నారు. వైకాపాను ఎన్డీయేలో చేర్చుకోవాల్సిన అవసరం భాజపాకు లేదు. అమరావతి విషయంలో రైతులకు న్యాయం జరగబోతుందని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. రైతులు, మహిళలు గాంధేయ మార్గంలో ఆందోళన కొనసాగించాలని ఆయన కోరారు. మాతృభాషలో చదువుకున్న మోదీ.. దేశానికి ప్రధాని అయ్యారన్న ఆయన… గౌతమ్ అదాని చమన్‌లాల్ విద్యాలయంలో గుజరాతీ మాధ్యమంలో చదువుకున్నారని తెలిపారు. ఆంగ్ల మాధ్యమంపై పట్టుండాలి గానీ మాతృభాషను తక్కువ చేయకూడదని పేర్కొన్నారు. రాజశేఖర్‌రెడ్డి పేరుతో పార్టీ పెట్టుకుని ఒక్క పథకానికైనా ఆయన పేరు పెట్టుకోలేదని రఘురామ ఎద్దేవా చేశారు.

Leave A Reply

Your email address will not be published.