ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ దేవిప్రియ కన్నుమూత

హైదరాబాద్ : హైదరాబాద్: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత దేవిప్రియ కన్నుమూరు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉదయం 7 గంటలకు దేవిప్రియ కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అనంతరం ఆసుపత్రి నుంచి ఆయన భౌతికకాయాన్ని అల్వాల్‌లోని ఇంటికి తరలించారు. కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతన్న దేవిప్రియ నవంబరు 6న ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. దేవిప్రియ మృతి పట్ల తెలుగు సాహితీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు సంతాపం ప్రకటించి, నివాళులు అర్పించారు.
కవిగా, పాత్రికేయుడిగా, సినీగేయ రచయితగా దేవీప్రియకు మంచిపేరుంది. “గాలిరంగు” కవిత్వానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. గుంటూరు జిల్లా పల్నాడులోని ఓబులేశునిపల్లెలో జన్మించిన దేవిప్రియ సినీరంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి జర్నలిజంలో స్థిరపడ్డారు. ‘అమ్మ చెట్టు’ మొదలుకొని ‘గాలిరంగు’ వరకు మొత్తం 7 కవితా సంపుటాలను రచించారు. 40 ఏళ్లుగా కొనసాగిన తన రచనా ప్రస్థానంలో తెలుగు నుంచి ‘గాలిరంగు’కు సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న కవిగా గుర్తింపు పొందారు. దేవీప్రియ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. దేవీప్రియ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు… కవిగా, రచయితగా, కార్టూనిస్టుగా దేవీప్రియ ఎంతో కృషి చేశారని కేసీఆర్ గుర్తుచేశారు. దేవీప్రియ సాహిత్య ప్రతిభకు “గాలిరంగు” రచన మచ్చుతునకగా వర్ణించారు.
ఎపి గవర్నర్ సంతాపం
అమరావతి: దేవీప్రియ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రచయితగా, కార్టూనిస్టుగా, కవిగా సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారని గవర్నర్ అన్నారు. దేవిప్రియ మరణం తెలుగు కవిత్వానికి తీరని లోటని గవర్నర్ అన్నారు. ‘గాలి రంగు’ రచన ఆయన సాహిత్య ప్రతిభకు మచ్చు తునక అని, కవి, అమ్మచెట్టు వంటి అత్యుత్తమ సంకలనాలు ఆయన కలం నుండి జాలువారాయన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు బిశ్వ భూషణ్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.