ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన సర్కార్
సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఫైర్

నాగర్‌కర్నూల్ : కరోనా కల్లోలంతో ప్రజలు అల్లాడుతుంటే కేసీఆర్ ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి చోద్యం చూస్తున్నారని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. ఫామ్‌హౌస్ వీడకుండా పాలన సాగిస్తున్న కేసీఆర్ రాజకీయంగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలు, ప్రజాస్వామ్యం గురించి కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. తాను మంత్రిగా ఉన్న వైద్య రోగ్య శాఖ నిర్వీర్యమవుతున్నా మంత్రి ఈటల రాజేందర్ ఏమీ చేయలేని స్థితిలో నిస్సహాయుడిగా ఉండిపోయాడన్నారు. ఇకనైనా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని,లేనిపక్షంలో మంత్రి పదవికి ఈటల రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు,సిబ్బంది కొరత ఉందని సకాలంలో వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కరోనా బాధితులకు ఎక్కడా సరైన చికిత్స అందట్లేదని భట్టి విక్రమార్క ఆరోపించారు.
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ రోగుల తెలంగాణగా మార్చాడన్నారు. కరోనా బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ఐదు రోజుల క్రితం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పర్యటించిన భట్టి విక్రమార్క తెలంగాణలో కరోనా మరణాలకు సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. నిజాలు మాట్లాడినవారిపై ఎదురు దాడికి దిగుతున్నారని విమర్శించారు. ప్రైవేటు ఆస్పత్రులు భారీ ఫీజులు వసూలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.