`పద్మ` పురస్కారాన్ని వెనక్కి ఇచ్చిన బాదల్
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తోన్న రైతులకు మద్దతు ప్రకటిస్తూ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, అకాళీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ పద్మ విభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చారు. వారికి మద్దతుగా పురస్కారాన్ని వెనక్కి ఇచ్చిన మొదటి వ్యక్తి ఈయనే. దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను కేంద్రం ఆయనకు 2015లో బహూకరించింది. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ అకాలీదళ్ ఇప్పటికే ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
పద్మ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నానని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు బాదల్ లేఖ రాశారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రజల వల్ల ముఖ్యంగా సాధారణ రైతుల వల్ల తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. అలాంటి రైతులు బాధ పడుతున్నప్పుడు… పద్మవిభూషణ్ పురస్కారం వల్ల తనకు వచ్చే గౌరవం అవసరం లేదని అన్నారు.