ఫీజులు కట్టకపోయినా.. `ఆన్‌లైన్`కు నిరాకరించొద్దు
ప్రైవేటు స్కూళ్లకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: ఫీజుల సాకు చూపి విద్యార్థులను ఆన్‌లైన్ తరగతులకు అనుమతి నిరాకరించరాదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించింది. వార్షిక పరీక్షల కోసం వారి పేర్లను రిజిస్టర్ చేయాలని ప్రైవేటు పాఠశాలలను హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని సికింద్రాబాద్‌లోని సెయింట్ లూయీస్, సెయింట్ ఆండ్రూస్, బోయినపల్లిలోని సెయింట్ ఆండ్రూస్ సంస్థలకు చెందిన బ్రాంచ్ పాఠశాలలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో గత ఏడాది మాదిరిగానే ఫీజులు తీసుకోవాలని.. ఈ ఏడాది పెంచరాదని.. అది కూడా అదనపు ఫీజులు పక్కనబెట్టి ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ ఫీజును కూడా నెలవారీ పద్ధతిలో తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇతరత్రా ఫీజులు తీసుకోవద్దని ఆదేశించింది. అయితే, జీవోకు వ్యతిరేకంగా.. ఏడాది ట్యూషన్ ఫీజును అడ్మిషన్ ఫీజుతో కలిపి ఒకేసారి చెల్లించాలంటూ పాఠశాలలు డిమాండ్ చేస్తున్నాయని హైకోర్టును విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్.. వార్షిక ఫీజులో 50శాతం ఒకేసారి చెల్లించాలని, మిగిలిన దానిని నెలవారీ చెల్లించాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దీనిపై డివిజన్ బెంచ్‌కు విద్యార్థుల తల్లిదండ్రులు శారదాషా, మరికొందరు అప్పీలు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం.. విద్యార్థులను ఆన్‌లైన్ తరగతులకు అనుమతి నిరాకరించరాదని పాఠశాలల యాజమాన్యాలకు స్పష్టం చేసింది.తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది.