బిజెపి ఎంపి ఆత్మహత్య!
న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన వయసు 62 ఏళ్లు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో ఆయన తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. విదేశాంగ వ్యవహారాలకు చెందిన స్టాండింగ్ కమిటీలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఎంపీ రామ్ స్వరూప్ శర్మకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.
సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి..
ఆర్ ఎం ఎల్ ఆసుపత్రి సమీపంలోని గోమతి అపార్ట్మెంట్లో శర్మ నివాసముంటున్నారు. బుధవారం ఉదయం శర్మ వ్యక్తిగత సహాయకుడు ఫోన్ చేయగా ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన అతడు పోలీసులకు ఫోన్ చేశారు. ప్లాట్‌కు వెళ్లిన పోలీసులు గది తలుపులు బద్దలు కొట్టగా.. ఎంపి ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించారు. ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ఎంపీ స్వరూప్ శర్మ గత కొన్నాళ్ల నుంచి తీవ్ర మానసికక్షోభలో ఉన్నారు. ఆరు నెలల నుంచి డిప్రెషన్ చికిత్స తీసుకుంటున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం ఆయన ఒంటరిగా ఉంటున్నారు. ఆయన భార్య .. చార్‌థామ్ యాత్రలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ స్వరూప్ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.