బీహార్ డీజీపీ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ
పాట్నా : బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్వచ్ఛంధ పదవీ విరమణ చేశారు. నటుడు సుశాంత్‌సింగ్ మృతి కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన బీహార్ డీజీపీ స్వచ్ఛంధ ఉద్యోగ విరమణ చేశారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారికి మంగళవారం చివరి పనిదినం. వీఆర్‌ఎస్ కోరుతూ పాండే పెట్టుకున్న అభ్యర్థనను బీహార్ గవర్నర్ మంగళవారం సాయంత్రం ఆమోదించారు. ఈ మేరకు దీనికి సంబంధించి హోంశాఖ నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. హోంగార్డ్, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ సంజీవ్ సింఘాల్‌కు డీజీపీ అదనపు బాధ్యతలు అప్పగించారు. 2019లో లోక్‌సభ ఎన్నికలకు ముందు గుప్తేశ్వర్ డీపీజీగా బాధ్యత స్వీకరించారు. ఔరంగాబాద్, జెహానాబాద్, అర్వాల్, బెగుసారై, నలంద తదితర నక్సల్స్ ప్రభావిత జిల్లాలో ఎస్పీగా పని చేశారు. ముంగెర్, ముజాఫర్‌పూర్ జోన్ డీఐజీగా, ఐజీగా, బీహార్ పోలీస్ శిక్షణ ఐజీగా పని చేశారు. వాస్తవానికి ఆయన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఆయన వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.