బైంసాలో చిరుత దాడి.. అడవి పంది మృతి
నిర్మల్: తెలంగాణ రాష్ట్రంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో తరచూ పులి సంచారం వార్తలు వింటూనే ఉన్నాం. తాజాగా నిర్మల్ భైంసా మండలం సిరాల, పాంగ్రా గ్రామాల శివారులో ఆదివారం చిరుత పులి దాడిలో అడవి పంది మృతి చెందింది. సిరాల గ్రామశివారులో క్రషర్ పనులకు వెళ్లిన గ్రామస్తులు అడవి పంది కళేబరాన్ని గుర్తించి, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీ శాఖ అధికారి పీ గంగారంకు సమాచారం అందించగా, సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు.
చుట్టుపక్కల ప్రదేశాలను పరిశీలించగా, చిరుతపులి పాదముద్రలు కనిపించినట్లు తెలిపారు. కొంత కాలంగా ఈ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తుండగా నీటి కోసం వచ్చిన అడవి పందిపై అది దాడిచేసినట్లు అనుమానిస్తున్నారు. కాగా, ప్రజలెవరూ ఈ ప్రాంతంలో ఒంటరిగా సంచరించవద్దని సూచించారు.
వేములవాడ: అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు రోజుల క్రితం బోయినపల్లి మండలం మల్కాపూర్‌లో కనిపించిన చిరుతపులి.. మళ్లీ ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున వేములవాడ అర్బన్ మండలంలోని మారుపాక శివారులో సంచరించింది. పొలం పనులకు వెళ్లిన రైతులకు పులి అడుగుల గుర్తులు కనిపించాయి. దీంతో విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. ఈనేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మారుపాక ప్రాంతంలో పులి సంచరిస్తుందన్న వార్త తెలిసిన స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు.
గత రెండు రోజుల క్రితం మల్కాపూర్‌లోని ఓ వ్యవసాయ బావిలో చిరుతపులి పడిపోయిన విషయం తెలిసిందే. అటవీ అధికారులు వచ్చేలోపే ఆ చిరుత అక్కడి నుంచి తప్పించుకున్నది. ఈ నేపథ్యంలో మళ్లీ ఇదే జిల్లాలో వేముల వాడ అర్బన్ మండలంలో చిరుత సంచిరించిందన్న దానిపై అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.