భారత్‌లో రైతు నిరసనలకు కెనడా ప్రధాని మద్దతు, తప్పుపట్టిన విదేశాంగ శాఖ

టొరొంటో: భారత ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. రాజధాని ఢిల్లీ వెలుపల, గడ్డకట్టే చలిని కూడా లెక్కచేయకుండా రహదారులపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలు చేస్తున్న ఈ నిరసనలపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో స్పందించారు.భారత్‌లో రైతుల నిరసనలకు సంబంధించి పలు వార్తలు వినిపిస్తున్నాయని,ఈ పరిస్థితికి చింతిస్తున్నానని తెలిపారు.అయితే నిరసన తెలుపుతున్న రైతులను ఉద్దేశిస్తూ.. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుకు కెనడా ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు.సమస్యల పరిష్కారంలో చర్చలకు ఎంతో ప్రాధాన్యం ఉందని,అందుకే వివిధ మార్గాల ద్వారా భారత అధికారులను సంప్రదించామని చెప్పారు.అందరమూ ఒక్కతాటిపైకి వచ్చి సమస్యను పరిష్కరించేందుకు అనువైన సమయం ఇదేనని అన్నారు.ఈ మేరకు జస్టిన్‌ ట్రూడో ఓ వీడియో పోస్ట్‌ చేశారు.కాగా కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తప్పుపట్టింది.కెనాడా ప్రధాని ట్రూడోవ్‌ తప్పుడు సమాచారంతో వ్యాఖ్యలు చేశారని,అసలు ఆయన స్పందించాల్సిన అవసరమే లేదని పేర్కొంది.రైతుల ఆందోళనలనేది తమ దేశ అంతర్గత వ్యవహారమని,అందులో జోక్యం చేసుకోవడం తగదని విదేశాంగ శాఖ పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.