భార్యను హత్యచేసి.. పక్కనే వీడియో గేమ్ ఆడుతూ..

జోధ్‌పూర్: భార్యభర్తల మధ్య చిన్న గొడవ మొదలై అది కాస్తా తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. దాంతో కట్టుకున్న భార్యను కత్తెరతో పాశవికంగా పొడిచి హతమార్చాడు. అంతేకాకుండా మృతదేహాం పక్కనే కూర్చుని మొబైల్‌లో వీడియో గేమ్ ఆడుతూ పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసాడు. ఈ ఘటన రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే… స్థానిక బీజేఎన్ కాలనీలో నివాసం ఉంటున్న విక్రమ్ సింగ్(35), శివ కన్వర్(30) భార్యభర్తలు. విక్రమ్‌కు ఏ ఉద్యోగం లేకపోవడంతో భార్యతో తరుచుగా గొడవలు జరుగుతుండేవి. సోమవారం భార్యభర్తల మధ్య చిన్న గొడవ మొదలై అది కాస్తా తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. దీంతో కోపం పట్టలేని విక్రమ్ సింగ్ ఇంట్లోని కత్తెరతో భార్యను పదే పదే పొడుస్తూ హత మార్చాడు. అనంతరం పోలీసులు, అత్త మామలకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి భార్య రక్తపు మడుగుల్లో పడి ఉండగా.. మృతదేహం పక్కనే నిందితుడు వీడియో గేమ్ అడుతూ కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ దంపతులకు ఇద్దరూ పిల్లలు ఉన్నట్లు, సంఘటన జరిగిన సమయంలో వారు ఇంట్లో లేరని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.