మంచి ఆరోగ్యం కోసం మిషన్ భగీరథ నీరు: మంత్రి కెటిఆర్

పెద్దపల్లి : మంచి ఆరోగ్యం కోసం మిషన్ భగీరథ నీటిని త్రాగాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని కేసీఆర్ మైదానంలో జరిగిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్-శైలజ దంపతుల కూతురు అక్షర-అక్షయ్ కుమార్(ఐపీఎస్)ల వివాహానికి మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, గంట వెంకట రమణారెడ్డి, రసమయి బాలకిషన్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి విందు ఆరాగించారు.
విందులో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ మినరల్ వాటర్‌కు బదులుగా మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ను ఏర్పాటు చేశారు. “మిషన్ భగీరథ పెద్దపల్లి జిల్లా” అనే లేబుల్‌లో వాటర్ బాటిల్స్‌ను విందులో ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ నీళ్లను సేవించిన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా స్పందిస్తూ.. మంచి ఆరోగ్యం కోసం ప్రజలు మిషన్ భగీరథ నీటిని వాడాలన్నారు.